నటుడు సునీల్, హీరో ఆనంద్ దేవరకొండకు సన్నివేశాన్ని వివరిస్తున్న డైరెక్టర్ దామోదర
సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం): తండ్రి పేరున్న కథా రచయిత, తాత నక్సలైట్ నాయకుడు... అతను మాత్రం వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘పుష్పక విమానం’ అనే సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ చిత్ర దర్శకుడు సృజన్(దామోదర) శ్రీకాకుళం వాసే. దర్శకుడి తండ్రి ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు. ఈయన ప్రస్తుతం శ్రీకాకుళంలోని విశాఖ ఎ కాలనీలో నివాసముంటున్నారు. సృజన్ తాత ప్రముఖ నక్సలైట్ నాయకులు మామిడి అప్పలసూరి. వీరి స్వగ్రామం కోమర్తి.
లఘు చిత్రాల నుంచి..
సృజన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసి సినిమాలపై ఇష్టంతో అటువైపు వెళ్లారు. తొలి తెలుగు కథగా చెప్పుకునే గురజాడ ‘దిద్దుబాటు’ ఆధారంగా సృజన్ ‘కమిలిని’ అనే షార్ట్‌ఫిల్మ్ తీశారు. సృజన్ అభిరుచికి ఈ లఘుచిత్రం ఓ మచ్చుతునక. ఈ షార్ట్ ఫిలింను అప్పట్లో దాసరి నారాయణరావు మెచ్చుకున్నారు కూడా. ఆయన జన్మదినం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఈ లఘుచిత్రంతోనే సృజన్ మొదటి బహుమతి గెలుచుకున్నాడు. అలాగే ఓ గిరిజన విద్యార్థిని స్కూల్ బాట పట్టించే కథాంశంతో తీసిన ‘సన్నాయి’ అనే షార్ట్‌ఫిలిం కూడా సృజన్‌కు మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పుడు పుష్పక విమానం ఫిలిం సర్కిళ్లలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
గోవర్దనరావు ప్రోత్సాహంతోనే..
ఈ సినిమాపై సృజన్ మాట్లాడుతూ విజయ దేవర కొండ తండ్రి గోవర్దనరావు ప్రోత్సాహంతోనే పుష్పక విమానం సినిమాను తెరకెక్కించానని తెలిపారు. నూతన దర్శకులు, నటులను ఆయన ఎంతో ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే తనకూ అవకాశం ఇచ్చారని తెలిపారు. హీరో విజయ్ దేవరకొండ కూడా అండదండలు అందించారని తెలిపారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రోజూ వింటున్న సంఘటనల ఆధారంగా తీసినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment