ఇంటి ముందు పార్క్ చేసిన కారులో నుంచి మంటలు చెలరేగి ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ : ఇంటి ముందు పార్క్ చేసిన కారులో నుంచి మంటలు చెలరేగి ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే సురేష్ రెడ్డి గత రాత్రి తన ఇంటి ముందు కారు పార్క్ చేశారు. సురేష్ రెడ్డి ఇద్దరు కుమారులు శుక్రవారం కారులో ఉన్న పెన్డ్రైవ్ తీసుకునేందుకు వెళ్లారు. కారు డోర్లు తెరిచి పెన్ డ్రైవ్ తీసుకుంటుండగా, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో కారు ముందు సీటులో ఉన్న సృజన్ కొద్దిపాటి గాయాలతో వెంటనే బయటకు రాగా, వెనక సీటులో ఉన్న శ్రేయన్ మంటల్లో చిక్కుకున్నాడు. సుమారు 80 శాతం గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన అతడు మృతి చెందాడు. మరోవైపు సృజన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా రాత్రి కారు పార్క్ చేసిన సమయంలో లైట్లు ఆఫ్ చేయకపోవడంతో, ఇవాళ ఉదయం కారు ఓపెన్ చేయగానే షార్ట్ సర్క్యూట్ సంభవించినట్లు సమాచారం. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.