
కారులో అగ్నిప్రమాదం
* మరో బాలుడికి తీవ్రగాయాలు
* ఆటాడుకుంటుండగా ఆకస్మికంగా మంటలు
హైదరాబాద్: కారులో ఆటాడుకుంటున్న ఇద్దరు చిన్నారులు అనుమానాస్పదస్థితిలో అగ్నిప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటన మీర్‌పేట పరిధిలోని గాయత్రీనగర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట్ మండలం అల్వాల్‌కు చెందిన లంకాల సురేష్‌రెడ్డి, శ్రీదేవి దంపతులు గాయత్రీనగర్‌లోని రామాలయం సమీపంలో నివాసముంటున్నారు.
వీరికి ఇద్దరు కుమారులు శృజంత్‌రెడ్డి(16), శ్రేయాన్‌రెడ్డి(8) ఉన్నారు. ఉదయం వారి ఇంటి ముందు పార్క్ చేసిన మారుతి జెన్ కారులోకి వెళ్లి పాటలు వింటూ ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో గాయపడిన శృజంత్‌రెడ్డి కారులోంచి బయటపడటం గమనించిన తల్లిదండ్రులు శ్రేయాన్‌రెడ్డి గురించి ఆరా తీసి కారు వద్దకు పరుగు తీశారు.
అప్పటికే కారుడోర్‌లు లాక్ కావడంతో కారు అద్దాలను బద్దలుకొట్టి లోపల ఉన్న శ్రేయాన్‌రెడ్డిని బయటకు లాగారు. తీవ్రగాయాలతో ప్రాణాపాయస్థితిలో ఉన్న ఇతన్ని మెరుగైన చికిత్స కోసం కర్మన్‌ఘాట్‌లోని అవేర్ ఆసుపత్రికి తరలిం చారు. అయితే చికిత్స పొందుతున్న బాలుడు సాయంత్రం మృతి చెందాడు. గాయపడిన శృజంత్‌రెడ్డి చికిత్స పొందుతున్నాడు. అగ్ని ప్రమాదం వల్లే ఈ ఘటన జరిగిందని, అయితే ప్రమాదం జరిగిన తీరుపై విచారణ జరుపుతున్నామని సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.