ghanapuram
-
ఓటును అమ్ముకోవద్దు
సాక్షి, ఖిల్లాఘనపురం: మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్నికలు, ఓటుహక్కు, మూఢనమ్మకాలపై గురువారం రాత్రి అవగాహన కల్పించారు. స్థానిక ఎస్ఐ నరేందర్ మండల కేంద్రంలోని బస్టాండు ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన పోలీస్ శాఖ కళాకారులు పలు విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటుహక్కు వినియోగంతోపాటు బాల్యవివాహాలు, సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, అంటరానితనం, మూఢనమ్మకాలు, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యల నివారణ, మహిళలపై లైంగిక దాడులు, హెల్మెట్ వాడకం తదితర వాటిపై పాటలు, నృత్యాలు, చలోక్తులతో చైతన్యపరిచారు. ఎస్ఐ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, సారా సీసాకు, డబ్బులకు ఓటును అమ్ముకోవద్దన్నారు. ఒక్కసారి లొంగిపోతే ఐదేళ్లపాటు నాయకుడు ఎన్ని తప్పులు చేసిన, మోసాలు చేసిన బానిసలుగా బతకాల్సిందేనని, ఓటు ప్రతి ఒక్కరికి వజ్రాయుధం లాంటిదన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ వారు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది, కళాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించండి వనపర్తి: అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగుల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు సెక్టోరల్ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ చంద్రారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆర్డీఓ తన చాంబర్లో సెక్టోరల్ అధికారులు, మండలాల ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులను పోలింగ్ స్టేషన్‌కు తీసుకువచ్చేందుకు ఆటో సౌకర్యం కల్పించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు నిర్మించాలని, దివ్యాంగులను పోలింగ్ కేంద్రంలోకి తీసుకువెళ్లేందుకు వలంటీర్లను ఏర్పాటు చేయాలని, ప్రతి పోలింగ్ కేంద్రంలో విద్యుత్, బాతురూం, నెట్ సౌకర్యం కల్పించాలని సూచించారు. బీఎల్ఓలకు పలు సూచనలు చేశారు. నియోజకవర్గంలో 278 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. కావాల్సిన కంటే ఎక్కువ గానే.. ఈవీఎంలు, వీవీ ప్యాట్స్‌ను ఎన్నికల సంఘం అధికారులు నియోజకవర్గానికి పంపించారన్నారు. సమావేశంలో డీఆర్డీఓ గణేష్, తహసీల్దార్ శాంతిలాల్, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు పాల్గొన్నారు. -
హీటర్ పెడుతుండగా..
సాక్షి, మేడ్చల్: వేడి నీళ్ల కోసం హీటర్ పెడుతుండగా ఓ బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన మేడ్చల్ మండలంలోని ఘనపూర్ గ్రామంలో జరిగింది. బీఎన్ఆర్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న కురకుల మోహన్(12) నీళ్లు వేడి చేసుకోవడానికి హీటర్ పెడుతున్నాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై అతను మృతిచెందాడు. -
పంట ఎండె.. గుండె మండె!
ఘణపురం నీళ్ల లొల్లి వరి పంట ఎండుముఖం కట్టలు తెగిన ఆవేదన షట్టర్లు తెరచిన దిగువ రైతులు ఠాణాకు చేరిన వివాదం పాపన్నపేట: ఘణపురం దిగువ రైతులు తిరగబడ్డారు. సాగు నీళ్ల కోసం ఆనకట్ట గేట్లు ఎత్తారు. ఎండుతున్న పొలాలకు నీళ్లందించేందుకు తెగించిన 200 మంది రైతులు శుక్రవారం ఆనకట్ట రెండు షట్టర్లను బలవంతంగా తెరిచి కిందకు నీళ్లు వదిలారు. అవి పొలాలకు చేరే వరకు అక్కడే కూర్చున్నారు. ఇంకోవైపు షట్టర్లు తెవరటం అన్యాయమంటూ కాల్వ కింద రైతులు ఎగువ రైతుల మీదకు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో విషయం పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది.ఘనపురం ప్రాజెక్టు కింద ఫతేనహర్, మహబూబ్ నహర్ కాలువలు ఉన్నాయి. ఈ రెండు కాలువల కింద 23 వేల ఎకరాల సాగు భూమి ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల వానలు పడక ప్రాజెక్టులోకి చుక్క నీరు రాలేదు. దీంతో ప్రాజెక్టు కింద పంటలు వేసుకోవద్దని ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో రెండేళ్లుగా రైతులు పంటలు వేయటం లేదు. ఈ ఏడాది కూడా వర్షాభావం నెలకొనడం.. తిండి గింజలకూ కరువైన పరిస్థితుల్లో దాదాపు 3 వేల ఎకరాల్లో వరి పంట వేశారు. పొట్ట దశలో ఉన్న వరి పొలాలు.. నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ఇదే సమయంలో డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి హరీశ్‌రావు చొరవతో సింగూరు నుంచి 0.35 టీఎంసీల జలాలను ఘనపురం ప్రాజెక్టులోకి విడిచారు. అయితే నది మధ్యలో ఉన్న మడుగులు ఆ నీటిని మింగేశాయి. అదృష్టవశాత్తు వెనువెంటనే ఎగువన కురిసిన వర్షాల వల్ల ఘనపురం ప్రాజెక్టులోకి 6.5 అడుగుల మేర నీరు వచ్చింది.ఈ నీటిని డిప్యూటీ స్పీçకర్ బుధవారం ఎంఎన్, ఎఫ్ఎన్ కాల్వల్లోకి వదిలారు. మా గతేం కావాలి.. అయితే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులకు సాగు నీరందటం లేదు. తమ పొలాలు ఎండి పోతున్నాయని ప్రాజెక్టు కింది రైతులు ఆందోళనకు గురయ్యారు. కనీసం తమకు కొన్ని నీళ్లు వదిలితే ఇసుకలో నీరింకి మంజీర నదిలో తాము వేసుకున్న ఊటబావుల్లో నీరు చేరుతుందని, తమ పొలాలు జీవం పోసుకుంటాయని వారంటున్నారు. అలాగే మంజీర నదిలో ఉన్న పొడిచన్పల్లి, కొత్తపల్లి, కుర్తివాడ రక్షిత మంచినీటి పథకాల్లో కూడా నీరు చేరి ప్రజల దాహార్తి తీరుతుందని అంటున్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఈ నెల 4న రాత్రి ఘనపురం ప్రాజెక్టు షట్టర్లను కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తడంతో నీరంతా దిగువన ఉన్న మంజీర నదిలోకి వెళ్లిపోయింది. ఈ మేరకు ఎగువన కాల్వల కింద ఉన్న రైతులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు రాత్రిపూట షట్టర్ల వద్ద కాపలా ఉంటున్నారు. తాజాగా పాపన్నపేట, మెదక్ మండలాలకు చెందిన సుమారు 200 మంది రైతులు శుక్రవారం ఘనపురం ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి షట్టర్లను తెరిచి నీళ్లు వదిలారు. ఈ నీళ్లు తమ పొలం చేరేవరకు ఇక్కడే ఉంటామని బైఠాయించారు. కాగా కాల్వల కింద ఉన్న రైతులు ఈ చర్యలను నిరసిస్తున్నారు. కాల్వల ద్వారానే నీరు: - ఈఈ యేసయ్య ప్రస్తుతానికి ఘనపురం ప్రాజెక్టులో నిల్వ ఉన్న పరిస్థితిని బట్టి కాల్వల ద్వారానే పొలాలకు వదులుతున్నాం. ప్రాజెక్టు కిందకు నీరు వదిలే పరిస్థితి లేదు. -
ఆదినుంచీ అవాంతరాలే
600 మెగావాట్ల ప్లాంట్‌పై కమ్ముకున్న చీకటి తెరలు ఈ నెలలో ఇప్పటికి మూడుసార్లు ఉత్పత్తికి బ్రేక్ మరమ్మతులకు నెల రోజులు పట్టవచ్చంటున్న అధికారులు గణపురం : మండలంలోని చెల్పూరు శివారులో గల కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం లోని 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌లో ఉత్పత్తికి పలుమార్లు అంతరాయం కలుగుతుండటంతో నష్టాల బాట పట్టింది. ప్లాం ట్‌పై చీకటి తెరలు కమ్ముకున్నాయి. ఆగస్టు నెలలో ఇప్పటికే మూడుసార్లు ఉత్పత్తి నిలిపోయింది. గత ఆరు రోజులుగా ప్లాంట్‌లో ఉత్పత్తికి బ్రేక్ పడింది. జూలైలోనూ రెండు పర్యాయాలు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. సీఎం కేసీఆర్ ఈ ఏడాది జనవరి 5న విద్యుత్ ప్లాంట్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఏకధాటిగా 15 రోజులు ఉత్పత్తి అయిన సందర్భం లేదు. వాస్తవానికి ప్లాంట్ ప్రారంభిం చిన రెండు నెలలకు కానీ సీఓడీ ప్రకటన రాలేదు. సీఓడీ జరిగిన తరువాత ప్లాంట్‌లో వారం, పది రోజులకోమారు విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతం జనరేటర్ సమస్య తలెత్తడంతో మరమ్మతు చేయడానికి నెల రోజులు పట్టవచ్చని అధికారులు అంటున్నారు. ప్లాంట్‌లో తరుచూ అంతరాయం ఏర్పడుతుండడంతో కేటీపీపీకి భారీ నష్టం వాటిల్లుతోంది. 600 మెగావాట్ల ప్లాంట్ నుంచి ఉత్పత్తి జరిగే విద్యుత్ 24 గంటలకు 14.5 మిలియన్ యూనిట్లు ఉంటుంది. యూనిట్‌కు రూ.5 చొప్పున విలువ కట్టినా రోజుకు కోట్ల రూపాయల నష్టం ఉంటుంది. -
కేటీపీపీ రెండు ప్లాంట్లలో విద్యుదుత్పత్తికి బ్రేక్
గణపురం : కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం లోని 500, 600 మెగావాట్ల ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి మంగళవారం అంతరాయం కలిగింది. 600 మెగావాట్ల ప్లాంట్‌లో ఉదయం, 500 మెగా వాట్ల ప్లాంట్‌లో రాత్రి 7 గంటలకు ఉత్ప త్తి నిలిపోయింది. బాయిలర్‌లో నీటి ఆవిరిని సరఫరా చేసే పైపులు పగిలిపోవడంతో అవాం తరం ఏర్పడింది. రెండు రోజుల్లో ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. -
‘సింగూరు’తోనే.. సిరులు!
మెదక్, న్యూస్‌లైన్: రబీలోనైనా సింగూరు నీరు పూర్తిస్థాయిలో అందుతాయన్న ఆశలో ఘనపురం ఆయకట్టు రైతులు ఉన్నారు. తుపాన్ల తాకిడి.. కరెంట్ కోతలు.. పెరిగిన ధరల మధ్య రాత్రింబవళ్లు కష్టపడ్డ రైతన్నలు ఎలాగోలా ఖరీఫ్ గట్టెక్కారు. వరికోతలు పూర్తవుతున్న నేపథ్యంలో రబీ కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ యేడు వర్షాలు బాగా పడటంతో సింగూరు, ఘనపురం ప్రాజెక్టులు నిండుకుండలా కళకళలాడుతున్నాయి. దీంతో ఆయకట్టు రైతాంగమంతా సింగూరు నీటి కోసం ఆశ పడుతోంది. జిల్లాలోని ఏకైక మధ్య తరహ ప్రాజెక్టు అయిన ఘనపురం ఆయకట్టు కింద సుమారు 22 వేల ఎకరాల సాగుభూమి ఉంది. నిబంధనల ప్రకారం సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపురం ఆయకట్టుకు ఏటా నాలుగు టీఎంసీల నీరు రావాలి. కానీ ఈ యేడు ఇంతవరకు సింగూరు నుంచి నీటి చుక్క కూడా విడుదల కాలేదు. ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు పడటంతో సింగూరు ప్రాజెక్టులో 27 టీఎంసీలు అంటే 1,772 అడుగుల నీరు నిలువ ఉంది. అలాగే ఘనపురం ప్రాజెక్టులో సైతం 8 అడుగుల మేర నీరు ఉంది. ప్రస్తుతం ఘనపురంలో ఉన్న నీటితో వరి తుకాలు వేసుకోవచ్చు. అయితే సింగూరు నీరు విడుదల చేసే అవకాశం ఉంటేనే వరి నారు పోసుకునేందుకు సాహసిస్తామని రైతులు చెపుతున్నారు. సుమారు 18 వేల ఎకరాల్లో పంట వేసే అవకాశముందని వారు అంటున్నారు. ఈ లెక్కన చూస్తే సింగూరు నుంచి 7 విడతలుగా 0.3 టీఎంసీల చొప్పున సుమారు 2 టీఎంసీల నీరు విడుదల చేస్తే సరిపోతుందని రైతులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్లో వర్షాలు బాగానే కురిసినప్పటికీ తుపాన్ తమను ముంచిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈసారైనా సింగూరు నుంచి నీరు విడుదల చేస్తే కొంతవరకు లాభం చేకూరుతుందని విజ్ఞప్తి చేస్త్తున్నారు. సింగూరు నీరు విడుదల చేసేందుకు శాశ్వత జీఓ లేకపోవడంతో ప్రతి ఏటా ఘనపురం అవసరాల కనుగుణంగా తాత్కాలిక జీఓ అవసరమవుతోంది. జిల్లాలోని మంత్రులు, ప్రజా ప్రతినిధులు స్పందించి సింగూరు నీరు విడుదల అయ్యేలా చర్యలు చేపడితే వచ్చే నెల మొదటి వారంలో వరి తుకాలు వేసుకుంటామని చెబుతున్నారు. ఎస్ఈ ఆఫీసుకు నేడు ప్రతిపాదనలు: ఇరిగేషన్ ఈఈ రబీ పంటల కోసం సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు నీరు విడుదల చేయాలంటూ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇరిగేషన్ ఈఈ జ్ఞానేశ్వర్ తెలిపారు. బుధవారం ఎస్ఈ కార్యాలయంలో వాటిని అందజేస్తామన్నారు. నీటి విడుదల కోసం తమ వంతు కృషి చేస్తున్నామన్నారు.