సాక్షి, ఖిల్లాఘనపురం: మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్నికలు, ఓటుహక్కు, మూఢనమ్మకాలపై గురువారం రాత్రి అవగాహన కల్పించారు. స్థానిక ఎస్‌ఐ నరేందర్ మండల కేంద్రంలోని బస్టాండు ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన పోలీస్ శాఖ కళాకారులు పలు విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటుహక్కు వినియోగంతోపాటు బాల్యవివాహాలు, సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, అంటరానితనం, మూఢనమ్మకాలు, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యల నివారణ, మహిళలపై లైంగిక దాడులు, హెల్మెట్ వాడకం తదితర వాటిపై పాటలు, నృత్యాలు, చలోక్తులతో చైతన్యపరిచారు.
ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, సారా సీసాకు, డబ్బులకు ఓటును అమ్ముకోవద్దన్నారు. ఒక్కసారి లొంగిపోతే ఐదేళ్లపాటు నాయకుడు ఎన్ని తప్పులు చేసిన, మోసాలు చేసిన బానిసలుగా బతకాల్సిందేనని, ఓటు ప్రతి ఒక్కరికి వజ్రాయుధం లాంటిదన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ వారు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది, కళాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించండి
వనపర్తి: అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగుల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు సెక్టోరల్ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ చంద్రారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆర్డీఓ తన చాంబర్‌లో సెక్టోరల్ అధికారులు, మండలాల ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులను పోలింగ్ స్టేషన్‌కు తీసుకువచ్చేందుకు ఆటో సౌకర్యం కల్పించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు నిర్మించాలని, దివ్యాంగులను పోలింగ్ కేంద్రంలోకి తీసుకువెళ్లేందుకు వలంటీర్లను ఏర్పాటు చేయాలని, ప్రతి పోలింగ్ కేంద్రంలో విద్యుత్, బాతురూం, నెట్ సౌకర్యం కల్పించాలని సూచించారు. బీఎల్‌ఓలకు పలు సూచనలు చేశారు. నియోజకవర్గంలో 278 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. కావాల్సిన కంటే ఎక్కువ గానే.. ఈవీఎంలు, వీవీ ప్యాట్స్‌ను ఎన్నికల సంఘం అధికారులు నియోజకవర్గానికి పంపించారన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ గణేష్, తహసీల్దార్ శాంతిలాల్, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment