సాక్షి, వనపర్తి: ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారు లేరు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి ధైర్యంగా నామినేషన్ దాఖలు చేసినవారు లేరూ.. దీంతో నామినేషన్ల ఉపసంహరణ దశలో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలాంటి బుజ్జగింపుల పర్వానికి ఎలాంటి ఆస్కారం లేదని స్పష్టమవుతోంది.
గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ రెబల్స్‌గా నామినేషన్ వేసిన దాఖలాలు లేవు. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులంతా ప్రధాన పార్టీలకు చెందినవారు కావడం, పైగా, రాష్ట్ర, జాతీయస్థాయి హోదాలో పలుకుబడి కలిగిన నేతలు ఉండటంతో తిరుబాటుదారుల భయం లేదని చెప్పొచ్చు.
బరిలో నిలిచేదెవరో?
ఎన్నికల్లో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఈనెల 19వ తేదీ వరకు 18 మంది 39 నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో అఫిడవిట్‌లో లోపాలు ఉన్నాయని ఆరుగురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. 12 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాట అయ్యాయి. వీరిలో టీఆర్‌ఎస్, మహాకూటమి, బీజేపీ అభ్యర్థులతో పాటు పలు జాతీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లు ఉన్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మొదటిరోజు గడువు పూర్తయింది. ఇప్పటి వరకు ఏ ఒక్కరు నామినేషన్లను వెనక్కి తీసుకోలేదు.
అభ్యర్థులు వీరే..
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) నుంచి సత్యం సాగరుడు, బీజేపీ నుంచి కొత్త అమరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి డాక్టర్ జి.చిన్నారెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బహుజన లెఫ్ట్ పార్టీ నుంచి జి.క్రిష్ణయ్య, సమాజ్‌వాదీ పార్టీ అక్కల బాబుగౌడ్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి సీఆర్. మునిస్వామి, స్వతంత్ర అభ్యర్థులు పుట్ట ఆంజనేయులు, పోల ప్రశాంత్, బూజుల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్.రాజ్‌కుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఇండిపెండెంట్‌గా టీజేఎస్ నేత
మహాకూటమితో జతకట్టిన ప్రొఫెసర్ కోదండరాం పార్టీ తెలంగాణ జన సమితిలో పార్టీ ఆవిర్భావం నుంచీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తాను కూడా పోటీలో ఉంటాననే సందేశం బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలాఉండగా, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రధానపార్టీల ఓట్లను తీల్చే అవకాశం ఉండదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరి బలం ఏమిటో తేలాలంటే డిసెంబర్ 11న నిర్వహించే ఓట్ల లెక్కింపు దాకా ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment