రబీలోనైనా సింగూరు నీరు పూర్తిస్థాయిలో అందుతాయన్న ఆశలో ఘనపురం ఆయకట్టు రైతులు ఉన్నారు.
మెదక్, న్యూస్‌లైన్: రబీలోనైనా సింగూరు నీరు పూర్తిస్థాయిలో అందుతాయన్న ఆశలో ఘనపురం ఆయకట్టు రైతులు ఉన్నారు. తుపాన్ల తాకిడి.. కరెంట్ కోతలు.. పెరిగిన ధరల మధ్య రాత్రింబవళ్లు కష్టపడ్డ రైతన్నలు ఎలాగోలా ఖరీఫ్ గట్టెక్కారు. వరికోతలు పూర్తవుతున్న నేపథ్యంలో రబీ కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ యేడు వర్షాలు బాగా పడటంతో సింగూరు, ఘనపురం ప్రాజెక్టులు నిండుకుండలా కళకళలాడుతున్నాయి. దీంతో ఆయకట్టు రైతాంగమంతా సింగూరు నీటి కోసం ఆశ పడుతోంది. జిల్లాలోని ఏకైక మధ్య తరహ ప్రాజెక్టు అయిన ఘనపురం ఆయకట్టు కింద సుమారు 22 వేల ఎకరాల సాగుభూమి ఉంది. నిబంధనల ప్రకారం సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపురం ఆయకట్టుకు ఏటా నాలుగు టీఎంసీల నీరు రావాలి.
కానీ ఈ యేడు ఇంతవరకు సింగూరు నుంచి నీటి చుక్క కూడా విడుదల కాలేదు. ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు పడటంతో సింగూరు ప్రాజెక్టులో 27 టీఎంసీలు అంటే 1,772 అడుగుల నీరు నిలువ ఉంది. అలాగే ఘనపురం ప్రాజెక్టులో సైతం 8 అడుగుల మేర నీరు ఉంది. ప్రస్తుతం ఘనపురంలో ఉన్న నీటితో వరి తుకాలు వేసుకోవచ్చు. అయితే సింగూరు నీరు విడుదల చేసే అవకాశం ఉంటేనే వరి నారు పోసుకునేందుకు సాహసిస్తామని రైతులు చెపుతున్నారు. సుమారు 18 వేల ఎకరాల్లో పంట వేసే అవకాశముందని వారు అంటున్నారు. ఈ లెక్కన చూస్తే సింగూరు నుంచి 7 విడతలుగా 0.3 టీఎంసీల చొప్పున సుమారు 2 టీఎంసీల నీరు విడుదల చేస్తే సరిపోతుందని రైతులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు బాగానే కురిసినప్పటికీ తుపాన్ తమను ముంచిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీసం ఈసారైనా సింగూరు నుంచి నీరు విడుదల చేస్తే కొంతవరకు లాభం చేకూరుతుందని విజ్ఞప్తి చేస్త్తున్నారు. సింగూరు నీరు విడుదల చేసేందుకు శాశ్వత జీఓ లేకపోవడంతో ప్రతి ఏటా ఘనపురం అవసరాల కనుగుణంగా తాత్కాలిక జీఓ అవసరమవుతోంది. జిల్లాలోని మంత్రులు, ప్రజా ప్రతినిధులు స్పందించి సింగూరు నీరు విడుదల అయ్యేలా చర్యలు చేపడితే వచ్చే నెల మొదటి వారంలో వరి తుకాలు వేసుకుంటామని చెబుతున్నారు.
ఎస్‌ఈ ఆఫీసుకు నేడు ప్రతిపాదనలు: ఇరిగేషన్ ఈఈ
రబీ పంటల కోసం సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు నీరు విడుదల చేయాలంటూ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇరిగేషన్ ఈఈ జ్ఞానేశ్వర్ తెలిపారు. బుధవారం ఎస్‌ఈ కార్యాలయంలో వాటిని అందజేస్తామన్నారు. నీటి విడుదల కోసం తమ వంతు కృషి చేస్తున్నామన్నారు.