‘యనమదుర్రు’ ప్రక్షాళనకు చర్యలు
భీమవరం టౌ న్ : యనమదుర్రు డ్రెయి న్ ప్రక్షాళన దిశగా జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దృష్టి సారించారు. యనమదుర్రు డ్రెయి న్ జలాలు నిర్జీవంగా మారడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో యనమదుర్రు డ్రెయి న్ ను ప్రక్షాళన చేస్తామని ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గొంతేరు డ్రెయి న్ ను మరో యనమదుర్రు కానివ్వబోమని గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్కు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ ఉద్యమిస్తున్న నేపథ్యంలో గతనెల 25న భీమవరంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శిక్షణ పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. యనమదుర్రు డ్రెయి న్ ప్రక్షాళనకు ప్రణాళిక సిద్ధం చేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు, రైతులు ఇలా అన్ని వర్గాల నుంచి యనమదుర్రు డ్రెయి న్ కాలుష్యానికి పరిశ్రమలు, మున్సిపాలిటీలు గ్రామాల నుంచి వస్తున్న మురుగు, చెత్త కారణమంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు పర్యావరణ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారుల బృందం శుక్రవారం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావుతో కలిసి యనమదుర్రు డ్రెయి న్ ను పరిశీలించారు.
ట్రీట్‌మెంట్ ప్లాంట్లపై చర్చ
యనమదుర్రు డ్రెయి న్ లో మురుగునీరు కలిసే చోట సావేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఎక్కడెక్కడ అవసరమో పరిశీలించారు. దెయ్యాలతిప్ప ప్రాంతంలో, భీమవరం పట్టణం రెస్ట్‌హౌస్ రోడ్డు శివారు గంగానమ్మ గుడి ప్రాంతంలో, అందరికీ ఇళ్లు నిర్మాణానికి కేటాయించిన 82 ఎకరాల స్థలం వద్ద ఎస్టీపీలు నిర్మాణంపై చర్చించారు.
అమృత్ పథకంలో 5 ఎంఎల్‌డీ ఎస్టీపీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావు వివరించారు. మరో 5 ఎంఎల్‌డీ ఎస్టీపీ నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్.వెంకటేశ్వర్లు బృందం యనమదుర్రు డ్రెయి న్ లో మురుగు కలుస్తున్న ప్రాంతాల ఫొటోలు తీసుకున్నారు. డ్రెయి న్ ప్రక్షాళనకు సంబంధించి మున్సిపల్ అధికారులతో చర్చించారు. మున్సిపల్ డీఈ శ్రీకాంత్, టౌ న్ ప్లానింగ్ అధికారులు వారి వెంట ఉన్నారు.