భక్తుల ఐడీ కార్డులను పరిశీలిస్తున్న ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ
– సాయంత్రం స్వర్ణర థోత్సవం
తిరుచానూరు :
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరగనుంది. ప్రతి ఏటా శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందుకోసం ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రత మండపాన్ని ఆలయ, ఇంజినీరింగ్ అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయం, ఆస్థానమండపాన్ని పచ్చని తోరణాలు, వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు వరలక్ష్మీ వ్రతం జరుగుతుంది. సాయంత్రం 6గంటలకు స్వర్ణరథంపై అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. వరలక్ష్మీవ్రతం సందర్భంగా శుక్రవారం అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల్‌సేవలను రద్దు చేశారు.
టికెట్లకు పోటెత్తిన భక్తులు
శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కౌంటర్లో గురువారం వరలక్ష్మీ వ్రతం టికెట్లు భక్తులకు విక్రయించారు. వ్రతం టికెట్లు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం 10 గంటల నుంచి టికెట్లు ఇవ్వనున్నట్లు ముందస్తుగా ప్రకటించారు. 200 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని, సిఫార్సులతో సంబంధం లేకుండా ముందు వచ్చిన వారికే టికెట్లు ఇస్తామని చెప్పడంతో భక్తులు ఉదయం 5 గంటల నుంచి బారులు తీరారు. గుర్తింపు కార్డులను తనిఖీ చేసిన తరువాతనే భక్తులకు టికెట్లు జారీ చేశారు. గంటల సమయంలో క్యూలో వేచి ఉండి టికెట్లు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, పేష్కార్ రాధాకృష్ణ, సూపరింటెండెంట్లు రవి, బాలాజీ, పవన్, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ గురవయ్య తదితరులు పాల్గొన్నారు.