‘‘గాంధీ తాత చెట్టు’ సినిమా మహాత్మాగాంధీగారి బయోపిక్ కాదు. గాంధీ, తాత, చెట్టు.. ఈ మూడింటి కథే ఈ చిత్రం. గాంధీగారి సిద్ధాంతాలు ఉన్న గాంధీ అనే అమ్మాయి అహింసావాదంతో తన ఊరిని, చెట్టును ఎలా కాపాడింది? అనేది కథ.
ప్రకృతి, మనుషుల మధ్య అహింస చాలా అవసరం అనే సందేశాన్ని మా సినిమా ద్వారా ఇస్తున్నాం’’ అని డైరెక్టర్ పద్మావతి మల్లాది చెప్పారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. తబితా సుకుమార్ సమర్పణలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధూరావు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు పద్మావతి మల్లాది మాట్లాడుతూ–‘‘నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను.
పీజీ పూర్తిచేసిన తర్వాత డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటిగారి దగ్గర రచనా విభాగంలో పనిచేశాను. ‘రాధే శ్యామ్, ‘మహానటి, చూసీ చూడంగానే, అమ్ము’ అనే సినిమాలతో పాటు ‘బృంద’ అనే వెబ్ సిరీస్‌కు రచయితగా పని చేశాను. ‘గాంధీ తాత చెట్టు’ విషయానికొస్తే.. చెట్టుకు, మనిషికి మధ్య ఉండే ప్రేమకథతో పాటు మొక్కల గురించి తర్వాతి తరం వాళ్లకు చెప్పాలనే సంకల్పంతో ఈ కథ రాశాను.
సందేశం, భావోద్వేగాలు, వాణిజ్య అంశాలున్న ఈ సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటుంది. సుకృతి వేణి గాంధీ పాత్ర కోసం నిజంగా గుండు చేయించుకుంది. ఈ సినిమాకు రీ అందించిన సంగీతం, నేపథ్య సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంది’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment