![Jayalalithaa not attend Krishna Daughter marriage with security reasons - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/16/krishna-supe-star.jpg.webp?itok=9gY6RDNY)
50 ఏళ్లపాటు నిరంతరాయంగా 'సాహసమే ఊపిరి'గా ఎన్నో రికార్డులను నెలకొల్పిన నటశేఖరుడు.. ఇక లేడనే విషయం తెలుసుకొని యావత్ సినీలోకం కంటతడిపెడుతోంది. అయితే సూపర్‌స్టార్ కృష్ణ మనల్ని విడిచి వెళ్లిపోయిన ఆయన జ్ఞాపకాలు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.
అలాంటి వాటిలో సూపర్‌స్టార్ కృష్ణ జీవితంలో జరిగిన ఒక సంఘటన మాత్రం ఔరా అనిపించకమానదు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే కుమార్తె వివాహానికి రావొద్దని చెప్పారంటే మనం నమ్మగలమా?. కానీ ఇదే నిజం.. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో ఒకసారి పరిశీలిస్తే..
కృష్ణ తన పెద్దకుమార్తె పద్మావతి వివాహ వేడుకను గల్లా జయదేవ్‌తో చెన్నైలో నిశ్చయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను సూపర్‌స్టార్ కృష్ణ స్వయంగా వెళ్లి వివాహానికి ఆహ్వానించారు. చెన్నైలోనే వివాహం జరుగుతుండటంతో అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేస్తూ తప్పకుండా వస్తానని మాటిచ్చింది.
అయితే వివాహానికి మూడు రోజుల ముందు జయలలిత సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి కృష్ణను కలిశారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపంలో మొదటి మూడు వరుసలు భద్రతా కారణాల రీత్యా జయలలితకు కేటాయించాల్సిందిగా సెక్యూరిటీ ఆఫీసర్ కోరారు. దీంతో షాక్ తిన్న కృష్ణ.. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖలు వివాహానికి వస్తున్న సంగతి చెప్పి మొదటి మూడు వరుసలు పూర్తిగా కేటాయించడం కదురదని చెప్పారు.
కృష్ణ వెంటనే జయలలితకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. ఈ క్రమంలోనే జయలలితను సున్నితంగా వివాహానికి రావొద్దని.. మీ ఆశీర్వచనాలు ఉంటే చాలని చెప్పారు. విషయాన్ని అర్థం చేసుకున్న జయలలిత వివాహానికి హాజరు కాకుండా పెళ్లిరోజున వధూవరులకు ఒక బొకేను పంపారు. కాగా, జయలలిత సూపర్‌స్టార్ కృష్ణతో గూఢాచారి 116, నిలువు దోపిడి వంటి సినిమాల్లో కలిసి నటించారు.
చదవండి: (మహేశ్ బాబు గొప్ప మనసు.. తీవ్ర విషాదంలోనూ వారికోసం..!)
Comments
Please login to add a commentAdd a comment