తప్పుడు ఫిర్యాదు ఇచ్చానని ఫిర్యాదుదారే అఫిడవిట్ ఇచ్చారు
ఆమె ఫిర్యాదు మేరకు పెట్టిన కేసును కొనసాగిస్తారో లేదో చెప్పండి
పోలీసులకు హైకోర్టు ఆదేశం.. విచారణ 28కి వాయిదా
అప్పటి వరకు కఠిన చర్యలొద్దన్న న్యాయస్థానం
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మరొకరిపై తాను చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని, ఆయన తనపై అత్యాచారం చేయలేదంటూ ఫిర్యాదుదారే ప్రమాణపూర్వక అఫిడవిట్ దాఖలు చేసినందున, ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసును ఏం చేయదలచుకున్నారో చెప్పాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
ఆ కేసును కొనసాగిస్తారో లేదో పూర్తి వివరాలను లిఖితపూర్వకంగా తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. అప్పటివరకు నాగార్జునపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కేసు కొట్టేయాలంటూ నాగార్జున పిటిషన్
ఉద్యోగం, కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానంటూ తన వద్ద డబ్బులు తీసుకున్నారని, లైంగికంగా వేధించారంటూ విజయవాడకు చెందిన పద్మావతి ఇచి్చన ఫిర్యాదు మేరకు నాగార్జునపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు కొట్టేయాలని కోరుతూ నాగార్జున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గత వారం విచారణకు రాగా.. పద్మావతి కోర్టు ముందు హాజరై, నాగార్జునపై తానిచి్చన ఫిర్యాదులోని అంశాలు అవాస్తవాలని తెలిపారు.
తనపై లైంగిక దాడి చేయలేదని, తమ ఇద్దరి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు కూడా లేవని చెప్పారు. సమాజంలో చాలా పెద్దవారు, రాజకీయ బలం ఉన్న వారు చేసిన ఒత్తిడి వల్ల నాగార్జునపై ఫిర్యాదు ఇచ్చినట్లు వివరించారు. ఆ మేరకు ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసు డైరీ (సీడీ)ని తమ ముందుంచాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.
రాజకీయ ఒత్తిళ్లతోనే ఫిర్యాదు చేశానని మరోసారి కోర్టుకు చెప్పిన పద్మావతి
ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. పోలీసుల తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) సాయి రోహిత్ సీడీ ఫైల్‌ను న్యాయమూర్తికి అందజేశారు. దానిని న్యాయమూర్తి పరిశీలించారు. అనంతరం పద్మావతితో న్యాయమూర్తి మాట్లాడారు. ప్రమాణ పత్రం గురించి ప్రశ్నించారు. దానిని తానే దాఖలు చేశానని పద్మావతి తెలిపారు.
నాగార్జున తనపై లైంగిక దాడి చేయలేదని, రాజకీయ ఒత్తిళ్లతోనే ఫిర్యాదు చేశానని మరోసారి చెప్పారు. కేసు ఎందుకు పెట్టాల్సి వచి్చందో సవివరంగా అఫిడవిట్ దాఖలు చేస్తామని పద్మావతి తరఫు న్యాయవాది టి.నాగార్జున రెడ్డి తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌పై తప్పుడు ఫిర్యాదు ఇచ్చానంటూ ఫిర్యాదుదారే ప్రమాణపూర్వకంగా చెప్పినందున, కేసును ఏం చేస్తారో చెప్పాలని పోలీసులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment