
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో విద్యా శాఖను భ్రష్టు పట్టిస్తున్నారని, లోకేష్ సకల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో చంద్రబాబు రాజకీయ జీవితంలో ప్రభుత్వ విద్యపై సాఫ్ట్ కార్నర్‌తో ఆలోచించారా? అంటూ ధ్వజమెత్తారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని.. పుస్తకాలపై వైఎస్ జగన్ బొమ్మలు ఉన్నాయని ఓర్వలేకపోయారంటూ దుయ్యబట్టారు.
‘‘ప్రభుత్వ పథకాలపై చంద్రబాబు బొమ్మలు లోకేశ్‌కు కానరాలేదా?. కూటమి పాలనలో పాఠశాల విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యారంగం ప్రోత్సాహకంలో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పాత్ర లేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో హయ్యర్ ఎడ్యుకేషన్‌ను క్వాలిటీతో అందించాం. కూటమి పాలనలో వర్శిటీ వైస్ ఛాన్సలర్లను భయపెట్టి రిజైన్ చేయించారు. ఇదేనా విద్యా వ్యవస్థను నడిపించే తీరు’’ అంటూ మేరుగ నాగార్జున ప్రశ్నించారు.
‘‘విద్యాశాఖ మంత్రిగా లోకేష్ విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పులు తెచ్చారా?. మేము తెచ్చిన సంస్కరణలను తొలగించడం తప్ప ఇంకేమీ చేయలేదు. అంబేద్కర్ ఆశయాలను చంద్రబాబు ప్రభుత్వం నీరు గార్చింది. జగన్ తెచ్చిన మార్పులను చూసి ఇతర రాష్ట్రాలే మెచ్చుకున్నాయి. కానీ అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబు ప్రభుత్వ స్కూళ్లను బాగు చేశారా?. ఇంగ్లీషు మీడియం, టెక్నాలజీ అభివృద్ధి, పిల్లలకు యూనిఫాం, షూస్ కూడా ఎందుకు ఇవ్వలేక పోయారు?
..పిల్లల పుస్తకాలు, రేషన్ సరుకులు, కుట్టు మిషన్లు, సైకిళ్లు, శ్మశానాలతో పాటు అప్పడాలు మీద కూడా చంద్రబాబు ఫోటోలు వేశారు. యూనివర్సిటీలో క్వాలిటీ చదువులు చెప్పించాం. అలాంటి యూనివర్సిటీలోని 17 మంది వైస్ ఛైర్మన్లను బెదిరించి రాజీనామాలు చేయించారు. 9 నెలలపాటు వీసీలు లేకుండానే యూనివర్సిటీలను నడిపిన నీచ చరిత్ర ఈ ప్రభుత్వానిది. టీడీపీ నేతల పుట్టినరోజులు, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించిన నీచ చరిత్ర చంద్రబాబుది. చివరికి క్లాసు రూముల్లో పార్టీ సభ్యత్వాలను నమోదు చేసిన నీచ చరిత్ర టీడీపీది. మీ అవసరాలకు యూనివర్సిటీలను వాడుకున్నారేగానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏ మంచి ఐనా చేశారా?. ఇప్పటికైనా జగన్ తెచ్చిన సంస్కరణలను అమలు చేయాలి. పేద విద్యార్థులకు నాణ్యమైన చదువులు చెప్పించాలి’’ అని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు.

Comments
Please login to add a commentAdd a comment