ఆసక్తికరంగా పాల పోటీలు
ఆసక్తికరంగా పాల పోటీలు
Published Fri, Sep 16 2016 8:10 PM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
ద్వారకా తిరుమల : రాష్ట్రస్థాయి గోవుల పాలపోటీల్లో భాగంగా శుక్రవారం పాల సేకరణను నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డులో వివిధ జాతుల గోవులు, గేదెల నుంచి ఉదయం, సాయంత్రం రెండు పూటల పాల ఉత్పత్తులను సేకరించారు. ఉదయం 8 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ సేకరణ దాదాపు గంటసేపు సాగింది. సేకరణ అనంతరం పాల ఉత్పత్తులను అధికారుల సమక్షంలో రైతులు తూకం వేయించి, నమోదు చేయించారు. అలాగే శనివారం ఉదయం సైతం ఇదే తరహాలో పాలను సేకరించి మూడుపూటల లభించిన ఉత్పత్తుల ఆధారంగా విజేతలను నిర్ణయించనున్నారు. ఉదయం మార్కెట్‌యార్డులో ఉన్న గో జాతులను ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నేత మేకా శేషుబాబు సందర్శించారు.
జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధకశాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో గెలుపొందే ముర్రా గేదెలు, ఒంగోలు ఆవులకు ప్ర«థమ బహుమతిగా రూ. 50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 30 వేలు, తతీయ బహుమతిగా రూ. 20 వేలు అందచేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే గిర్, పుంగనూరు జాతి ఆవులకు ప్రథమ బహుమతిగా రూ. 25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 15 వేలు, తతీయ బహుమతిగా రూ. 10 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. ఇందులో పాల్గొనే ప్రతి ఆవుకు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నామన్నారు. శనివారం మద్యాహ్నం నుంచి జరిగే అందాల పోటీల్లో గెలుపొందే వాటికి తగు బహుమతులు అందించనున్నట్టు చెప్పారు. విజేతలకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయ్యన్న పాత్రుడు చేతులు మీదుగా బహుమతి ప్రదానం ఉంటుందని నిర్వాహకులు చెప్పారు.
Advertisement