మహాలక్ష్మీ నమోస్తుతే..
మహాలక్ష్మీ నమోస్తుతే..
Published Fri, Aug 26 2016 6:21 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
ద్వారకా తిరుమల : ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నేత్రపర్వంగా సాగాయి. శ్రావణమాసంలో ఆఖరి శుక్రవారం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సుమారు 15 వందల మంది మహిళలు వ్రతాలు ఆచరించారు. ఆలయ తూర్పు రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై వరలక్ష్మీ దేవి అమ్మవారి విగ్రహాన్ని ఉంచి ప్రత్యేకంగా అలంకరించారు. వేదిక ముందు వందల సంఖ్యలో మహిళలు దేవస్థానం అందచేసిన పూజా సామగ్రితో కూర్చున్నారు. ఆలయ అర్చకులు, పండితులు, పురోహితులు మహిళలతో పూజా కార్యక్రమాన్ని వేద మంత్రోచ్ఛరణల నడుమ జరిపించారు. ఆలయ ఈవో వేండ్ర త్రినా«థరావు దంపతులు కూడా పాల్గొని పూజలు నిర్వహించారు.
క్షేత్రపాలకుని ఆలయంలో వరుణజపాలు
వర్షాలు సమద్ధిగా కురవాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిన వెంకన్న క్షేత్రంలో వరుణ జపాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. క్షేత్రపాలకుడు భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో పండితులు ఈ జపాలను జరిపారు. తొలుత ఆలయ ముఖ మండపంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యహవాచన, కలశస్థాపనను నిర్వహించారు. 28న శివదేవునికి సహస్ర ఘటాభిషేకాన్ని జరుపనున్నట్టు ఈవో తెలిపారు.
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి
చినవెంకన్న క్షేత్రంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఉదయం శేషాచలకొండపై ఉన్న గోసంరక్షణ శాలలోని ఒంగోలు, కపిల ఆవులకు పండితులు, పురోహితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ భక్తులు విశేష పూజలు చేశారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని సప్తగోకులంలో శ్రీకృష్ణునికి పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సాయంత్రం శ్రీవారి క్షేత్రంలో ఉట్లు పండుగ నిర్వహించనున్నట్టు ఈవో చెప్పారు. దీనిలో భాగంగా ఉభయదేవేరులతో శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతారని తెలిపారు.
Advertisement