రేపు చినవెంకన్న తెప్పోత్సవం
ద్వారకా తిరుమల : క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం చినవెంకన్న తెప్పోత్సవం నేత్రపర్వంగా జరగనుంది. ఇందుకు క్షేత్రంలోని పుష్కరణి వద్ద సరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏటా ఈ ఉత్సవాన్ని శ్రీవారి దేవస్థానం అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడు కూడా వేడుకను నేత్రపర్వంగా జరిపేందుకు దేవస్థానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే శ్రీవారి పుష్కరణిని, గట్లును అలంకరించారు. పుష్కరణి పరిసరాలను విద్యుద్దీప తోరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. పుష్కరణి ముందు స్వామివారి భారీ విద్యుత్ కటౌట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. తెప్పను హంసగా ముస్తాబు చేస్తున్నారు. ఈ తెప్పోత్సవ వేడుక శనివారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభమౌతుందని ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు.