సమ్మె సక్సెస్
సమ్మె సక్సెస్
Published Sat, Sep 3 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
‘కదం తొక్కుతూ.. పదం పాడుతూ.. హృదాంతరాళం గర్జిస్తూ..’ అన్నరీతిన జిల్లాలోని కార్మికులు సర్కారు తీరుపై గర్జించారు. సమస్యలను పరిష్కరించాలని, డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం చేపట్టిన దేశవ్యాప్త సమ్మె జిల్లాలో విజయవంతమైంది. అన్ని కార్మిక సంఘాలు, పలు ఉద్యోగ సంఘాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి.
పలుచోట్ల కార్మికులు వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : జాతీయస్థాయిలో కార్మిక, ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె జిల్లాలో విజయవంతమైంది. ఈ సమ్మెకు దాదాపు అన్ని సంఘాలూ మద్దతు పలికాయి. ఏలూరు కార్పొరేషన్,
భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాలతో పాటు మెట్ట ప్రాంతంలోనూ కార్మికులు ఉదయం నుంచి ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేశారు.
వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ డిపోల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకున్నారు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి మూయించివేశారు. ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు మూయించివేశారు. కార్మిక సంఘాల సమ్మెకు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపి ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టాయి. ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, కేవీపీఎస్ సంఘాలు ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఆయా సంఘాల నాయకులు ప్రధాన కూడళ్లలో ప్రసంగాలు, నినాదాలు చేశారు. పోలీసుల సహాయంతో బస్సులు తిరిగాయి. తొలుత సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు మద్దతు పలికినా గురువారం లేబర్ కమిషన్ బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు అదేశాలు జారీ చేయటంతో శుక్రవారం జరిగిన సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొనలేదు.
Advertisement