in west godavari
-
పోలీసుల అదుపులో నకిలీ పోలీస్?
ఏలూరు (సెంట్రల్): పోలీసు కానిస్టేబుల్‌గా చెలామణి అవుతూ పేకాట స్థావరాల నుంచి వసూళ్లుకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఓ వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో మొత్తం డొంక అంత కదిలినట్టు తెలిసింది. ఏలూరు ఆర్ఆర్ పేటకు చెందిన సదరు వ్యక్తి నుంచి పోలీసు దుస్తుల్లో దిగిన ఫొటోలు, నకిలీ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సదరు వ్యక్తిని మూడు రోజులుగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్సై, సీఐల తలలో నాలుకలా ఉంటూ.. నిందితుడు గతంలో నగరంలోని ఓ స్టేషన్లో పనిచేసి బదిలీపై వెళ్లిన ఇన్స్పెక్టర్కు తలలో నా లుకలా ఉండేవాడు. ఆ అధికారి జీపులోనే తిరుగుతూ బయటవారికి కానిస్టేబుల్‌గా పరిచయం అయ్యాడు. సదరు అధికారికి మామూళ్లను తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించేవాడని కొందరు పోలీసు సిబ్బంది చెబుతున్నారు. సదరు ఇన్స్పెక్టర్ అక్కడ నుంచి బదిలీ అయిన కొన్ని రోజులకు ఏలూరుకు ఆనుకొని ఉన్న ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ వద్దకు మకాం మార్చాడు. ఆ అధికారి వద్దనే తిరుగుతూ ఆ సర్కిల్ పరిధిలో జరిగే పేకా ట, కోడి పందాల స్థావరాల నుంచి డబ్బులు వ సూళ్లకు పాల్పడేవాడు. ఈ విషయం సదరు అధికారికి తెలియడంతో మందలించి పంపించి వేసినట్టు సమాచారం. వివాహిత ఫిర్యాదుతో కదిలిన డొంక నిందితుడు తాను పోలీసు కానిస్టేబుల్ని అని చెబుతూ ఓ వివాహితతో పరిచయం పెంచుకుని ఆమెను లొంగదీసుకున్నాడు. సదరు వివాహితను కొన్నిరోజులుగా వేధింపులకు గురి చేయడంతో పాటు ఆమెకు సంబంధించిన ఆస్తి పత్రాలపై సం తకాలు చేయించుకోవడంతో ఆమె టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పం దించిన పోలీసులు అతడిని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. నగరంలోని పలువురు పోలీసు సిబ్బందినీ అతడు జిల్లాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ అని బురిడీ కొట్టించినట్టు విచారణలో తేలింది. రాత్రిళ్లు ఓ వ్యక్తి వాహనచోదకుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులతో సదరు వ్యక్తికి దీనికి సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అడుగడుగునా నీరాజనం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తుందుర్రు ఆక్వా ఫుడ్‌పార్క్ బాధితులకు బాసటగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం చేపట్టిన జిల్లా పర్యటన విజయవంతమైంది. అడుగడుగునా ప్రజలు ఆయనకు నీరాజనాలు పలికారు. ప్రతి గ్రామానా ఘనస్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. జయహో జగన్ అంటూ నినదించారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయలుదేరిన జననేత కలపర్రు టోల్గేట్ వద్దకు చేరుకోగానే ఏలూరు నేతలు గుడిదేశి శ్రీనివాస్, మంచం మైబాబు, బొద్దాని శ్రీనివాస్ నేతృత్వంలో వంద కార్ల ర్యాలీతో కార్యకర్తలు, ప్రజలు జననేతకు ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం దెందులూరు వద్ద పార్టీ ఆ నియోజకవర్గ కన్వీనర్‡ కఠారి రామచంద్రరావు నేతృత్వంలో ప్రజలు జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోమటిలంకతోపాటు పలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. గుండుగొలను జంక్షన్, కైకరం, పూళ్ల, నారాయణపురంలలో ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు నేతృత్వంలో జగనన్నకు కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. తాడేపల్లిగూడెం బైపాస్ వద్ద తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వాగతం పలికారు. అక్కడ కొట్టు సత్యనారాయణకు జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జగన్మోహన్రెడ్డి దువ్వ మీదుగా తణుకు సబ్ జైలుకు చేరుకునే సరికి మధ్యాహ్నం 12 గంటలు అయింది. అక్కడ తుందుర్రు పోరాటంలో అరెస్టయిన ఆరేటి సత్యవతిని జగన్ పరామర్శించారు. అనంతరం అక్కడ ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న సీపీఎం నేతలకు సంఘీభావం తెలిపారు. ఒంటిగంటకు తుందుర్రుకు బయలుదేరిన జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. దీంతో తణుకు నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీమవరం చేరడానికి నాలుగు గంటల సమయం పట్టింది. వేల్పూరు, రేలంగి, అత్తిలి, పాలూరు, కొమ్మర, ఈడూరు, కోరుకొల్లు, మోగల్లు, పాలకోడేరు మీదుగా జగన్మోహన్రెడ్డి భీమవరం చేరుకున్నారు. మధ్యలో అభిమానుల కోరిక మేరకు అంబేడ్కర్, రంగా, వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. గునుపూడి, తాడేరు, బేతపూడి మీదుగా తుందుర్రు చేరుకున్న జగన్మోహన్రెడ్డికి అక్కడి ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆయన రాక కోసం ఉదయం నుంచే వేలాది మంది బాధితులు వేయి కనులతో నిరీక్షించారు. తుందుర్రు, బేతపూడి, జొన్నల గరువుతోపాటు గొంతేరు కాలుష్యం వల్ల ఇబ్బంది పడే తీరప్రాంత గ్రామాల ప్రజలూ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫ్యాక్టరీ వద్దంటూ నినదిస్తూ ముందుకుసాగారు. తుందుర్రు నుంచి బేతపూడి వరకూ సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ప్రదర్శనగా జగన్మోహన్రెడ్డి వెంట ప్రజలు నడిచారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారథి, రాష్ట్ర ప్రోగామింగ్ కమిటీ కన్వినర్ తలశిల రఘురామ్, నేతలు వంకా రవీంద్రనాథ్, మేకా శేషుబాబు, కారుమూరి నాగేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, తెల్లం బాలరాజు, ఘంటా మురళీరామకృష్ణ, తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, తలారి వెంకటరావు, కఠారి రామచంద్రరావు, పుప్పాల వాసుబాబు, కవురు శ్రీనివాస్, గుణ్ణం నాగబాబు, పిళ్లంగోళ్ల శ్రీలక్ష్మి, సాయిబాల పద్మ, కొయ్యె మోషేన్ రాజు, కారుమంచి రమేష్, దిరిశల కృష్ణ శ్రీనివాస్, ఉదరగొండ చంద్రమోళి, బొద్దాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సమ్మె సక్సెస్
‘కదం తొక్కుతూ.. పదం పాడుతూ.. హృదాంతరాళం గర్జిస్తూ..’ అన్నరీతిన జిల్లాలోని కార్మికులు సర్కారు తీరుపై గర్జించారు. సమస్యలను పరిష్కరించాలని, డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం చేపట్టిన దేశవ్యాప్త సమ్మె జిల్లాలో విజయవంతమైంది. అన్ని కార్మిక సంఘాలు, పలు ఉద్యోగ సంఘాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. పలుచోట్ల కార్మికులు వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్ పేట) : జాతీయస్థాయిలో కార్మిక, ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె జిల్లాలో విజయవంతమైంది. ఈ సమ్మెకు దాదాపు అన్ని సంఘాలూ మద్దతు పలికాయి. ఏలూరు కార్పొరేషన్, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాలతో పాటు మెట్ట ప్రాంతంలోనూ కార్మికులు ఉదయం నుంచి ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ డిపోల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకున్నారు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి మూయించివేశారు. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు మూయించివేశారు. కార్మిక సంఘాల సమ్మెకు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపి ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టాయి. ఐద్వా, ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ సంఘాలు ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఆయా సంఘాల నాయకులు ప్రధాన కూడళ్లలో ప్రసంగాలు, నినాదాలు చేశారు. పోలీసుల సహాయంతో బస్సులు తిరిగాయి. తొలుత సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు మద్దతు పలికినా గురువారం లేబర్ కమిషన్ బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు అదేశాలు జారీ చేయటంతో శుక్రవారం జరిగిన సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొనలేదు. -
మొక్కుబడికి వెళుతూ..మృత్యుఒడికి
మేరీమాత గుడికి వెళుతూ ప్రమాదం ఆటో ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి మృతుల్లో ముగ్గురు మూడేళ్లలోపు చిన్నారులే పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోరం పుట్టిన బిడ్డకు పుట్టు వెంట్రుకలుతీయించాలని బయల్దేరారు... అన్నదమ్ముల బిడ్డలతోముస్తాబయ్యారు ...పిల్లల కేరింతలు ... ఇరుగు,పొరుగు అప్పగింతల మదయ ఆటోలో వెళ్లిన ఆ కుటుంబాలనుమృత్యువు వెంటాడింది...ఆలయానికి వెళ్లకముందే విషాదం అలుముకుంది...ముగ్గురు పసికందులతోపాటు పెద్దల్నీ చిదిమేసింది..ఆనంద విహారాన్ని కకావికలం చేసింది.. అమలాపురం టౌన్ / అయినవిల్లి : వివిధ పనులపై హైదరాబాదు నుంచి అయినవిల్లి మండలం నేదునూరు శివారు పెదపేటకు వచ్చిన వారు ... ఆ పనులన్నీ ముగించి శుక్రవారం తిరుగుపయనమవ్వాలి ... ఈలోగా పిల్లాడి పుట్టు వెంట్రుకలు ఇచ్చి వెళ్దామనుకున్నారు. అన్న భార్య, పిల్లలతో సతీ సమేతంగా పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నానికి ఆటోలో గురువారం బయలుదేరిన రాజేంద్ర ప్రసాద్ కుటుంబం.. మొక్కు తీరకుండానే.. కొవ్వూరు మండలం బంగారమ్మపేట వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మృత్యువాత పడింది. వారు ప్రయాణిస్తున్న ఆటోను హెచ్‌పీ గ్యాస్ సిలెండర్ల లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో పి.రాజేంద్రప్రసాద్ (27), అతని భార్య శాంతి (24), వారి 14 నెలల కుమార్తె లెహన్యాతోపాటు రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య కుమారులు జీవన్ యాదాద్రి (3), వినయ్ బెహనర్ (2)లు మృతి చెందారు. మిగిలిన వారంతా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సొంతపనుల కోసం వచ్చి... రాజేంద్ర ప్రసాద్ ఓ ప్రైవేటు ఉద్యో గం చేసుకుంటూ భార్య, కుమార్తెతో హైదరాబాదులో ఉంటున్నాడు. టైఫాయి డ్ జ్వరం రావటంతో విశ్రాంతితోపాటు సాధికార సర్వే చేయించుకోడానికి ఇక్కడకు వచ్చా డు. ఎలాగూ వచ్చాం కదా అని పుట్టు వెంట్రుక లు తీయించేద్దామని అందరూ ఆటోలో పయనమయ్యారు. మరో గంటలో మేరీమాత ఆలయానికి వెళతారనగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రేమను చిదిమేసిన విధి... నేదునూరుకు చెందిన శాంతిని రాజేంద్రప్రసాద్ ప్రేమించి మూడేళ్ల కిందట పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. ఏడాది కిందటే పాప పుట్టింది. రెండు నెలల క్రితమే కూతురు పుట్టిన రోజు వేడుకను బంధువుల సమక్షంలో సందడిగా జరుపుకున్నారు. రెండు నెలల తరువాత మళ్లీ తన సొంత ఊరికి వచ్చిన ఈ కుటంబం ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవటం తట్టుకోలేకపోతున్నామని అతని తండ్రి వెంకట్రావు, బంధువులు బోరున విలపిస్తున్నారు. మరదలికి తోడుగా వెళ్దామని... మరదలికి తోడుగా వెళ్దామని వీరవేణి బయల్దేరింది. తామూ వస్తామని వెంటపడడంతో పిల్లలు జీవన్, వినయ్‌లను తీసుకువెళ్లింది. సందడిగా ఆటో ఎక్కిన ఆ పిల్లలిద్దర్నీ రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది. ఓ వైపు పిల్లలు విగతజీవులుగా మారారు ... ఇంకోవైపు భార్య అచేతనంగా ఆసుపత్రిలో పడి ఉంది. ఈ దుస్థితిని చూసిన భర్త రోదన అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. వెళ్లే ముందు తమ్ముడికి రాఖీ కట్టి... రాజేంద్రప్రసాద్ భార్య శాంతి గౌరీపట్నం బయలుదేరే ముందు ఊళ్లోని ఇంటర్మీడియట్ చదువుతున్న తమ్ముడు ఆనందకుమార్ చేతికి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టి మిఠాయి తినిపించింది. రాఖీ కట్టి ... ఆశీర్వదించిన రెండు గంటలకే అక్క చనిపోవడాన్ని తమ్ముడు తట్టుకోలేకపోతున్నాడు. ఆగిపోయిన చిన్నారుల కేరింతలు... రెండు,మూడేళ్ల వయసున్న ఆ చిన్నారులు ఆటోలో తమ తల్లుల ఒడిలో వేసిన కేరింతలు, చేసిన అల్లరి అంతలోనే ఆగిపోయింది. మనవళ్ల ఆనందాన్ని కళ్లారా చూసిన నాన్నమ్మ కన్నీళ్లపర్యంతమవుతోంది. క్షణంలోనే ఇంతటి క్షోభ పగవారికి కూడా వద్దంటూ విలపిస్తోంది. -
పచ్చగడ్డితో అధిక పాల దిగుబడులు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : గేదెలు, ఆవుల పెంపకం ద్వారా ఉపాధి పొందుతున్న రైతులు సరైన పాల దిగుబడి రాక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వం అధ్యయనం చేయించిందని, పచ్చగడ్డి మేపడం ద్వారా అధిక పాల దిగుబడి వస్తుందని గుర్తించినట్టు పశు సంవర్థక శాఖ జిల్లా జేడీ కె.జ్ఞానేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో పశువులకు పచ్చగడ్డి మేపడం ద్వారా లీటర్ నుంచి లీటరున్నర వరకు అధిక పాలదిగుబడులు పొందవచ్చని, అందుకోసం జిల్లావ్యాప్తంగా పశుగ్రాస క్షేత్రాల పెంపకం చేపడుతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పచ్చగడ్డి మేపడం ద్వారా పశువుల్లో పాల దిగుబడి అధికంగా వస్తుందని అధ్యయనంలో తేలడంతో రైతులకు పచ్చగడ్డి అందించేందుకు ఈ పశుగ్రాస క్షేత్రాల పెంపకంపై దృష్టి సారించింది. దీని కోసం ప్రభుత్వం జిల్లాలోని రైతుల నుంచి భూమిని సేకరిస్తోంది. సేకరించిన భూమిలో పశుగ్రాసం పెంచడం ద్వారా అటు పశుగ్రాస పెంపకం రైతులకు, ఇటు పాడి రైతులకు లాభాలు వచ్చే అవకాశముండడంతో ఈ క్షేత్రాలపై రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పశుగ్రాస క్షేత్రాల కోసం భూమి సేకరణ జిల్లాలో పశుగ్రాస క్షేత్రాల పెంపు కోసం భూ సేకరణ చేపడుతోంది. అన్నివేళలా నీరు సమ్రుద్ధిగా ఉండి వ్యవసాయం చేయని భూ యజమానుల నుంచి ఈ క్షేత్రాల కోసం భూమి సేకరిస్తోంది. అయితే ఈ భూమిని లీజు ప్రాతిపదికన మాత్రమే తీసుకుంటోంది. ఈ మేరకు కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఇటీవల సంబంధిత అధికారులతో చర్చలు నిర్వహించిన అనంతరం పశుగ్రాస క్షేత్రాలకు భూమి ఇచ్చే రైతులకు ఎకరానికి సాలుకు రూ. 25 వేలు లీజు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. రైతులు, స్వయం సహాయక సంఘాలకు భూమి ప్రభుత్వం నిర్ణయించిన ఈ లీజు ధరకు భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చే రైతుల నుంచి భూమిని సేకరిస్తారు. భూమి ఇచ్చిన రైతులు ముందుకు వస్తే పశుగ్రాస క్షేత్రాలను వారే పెంచుకోవచ్చు. వారికి ఆసక్తి లేకపోతే ఆయా ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలకు ఈ భూమిని అప్పగిస్తారు. ఈ భూమిలో పశుగ్రాసం పెంచి ఆ ప్రాంతంలోని రైతులకు పచ్చగడ్డిని ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పాడి రైతులకు అందచేయాల్సి ఉంటుంది. కిలో రూపాయికే పచ్చగడ్డి పశుగ్రాస క్షేత్రాల్లో పెంచే పచ్చగడ్డిని ఆ ప్రాంతంలోని పాడి రైతులకు కిలో రూపాయికే ఇవ్వాలని కలెక్టర్ కె.భాస్కర్ ప్రభుత్వ ధరగా నిర్ణయించారు. ఎకరం పొలంలో పండించే పశుగ్రాసం ఏడాది పొడవునా ఆయా ప్రాంతాల్లోని పాడి రైతులకు ఒక్కో పశువుకు రోజుకు 20 కిలోలు చొప్పున సరఫరా చేస్తే సరిపోతుందని అంచనా వేశారు. పాతర గడ్డి/సైలేజ్ గడ్డి పండిన పచ్చగడ్డి స్థానిక రైతుల అవసరాలకు పోను మిగిలితే రాయలసీమ ప్రాంతాలకు ఎగుమతి చేయవచ్చు. పచ్చగడ్డిని ముక్కలుగా చేసి పులిసిపోకుండా ప్రాసెస్ చేసి గాలి చొరబడకుండా ప్లాస్టిక్ సంచుల్లో ప్యాకింగ్ చేస్తే అది తాజా పచ్చగడ్డిలా ఎన్నాళ్లైనా నిలువ ఉంటుంది. అలా నిల్వ చేసి అవసరమైన వారికి ఎగుమతి చేసుకోవచ్చు. ఈ సైలేజ్ గడ్డిని కిలో రూ.2కు విక్రయించుకోవచ్చు. ఈ పశుగ్రాస క్షేత్రాల్లో పండించే పచ్చగడ్డిపై రైతుకు కిలోకు గరిష్టంగా 40 పైసలు, కనిష్టంగా 25 పైసలు ఆదాయం లభిస్తుంది. భూసేకరణకు దరఖాస్తుల ఆహ్వానం జిల్లా వ్యాప్తంగా పశుగ్రాస క్షేత్రాల పెంపకం కోసం భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాం. ఇప్పటివరకూ జిల్లాలోని 72 గ్రామాల నుంచి సుమారు 160 మంది రైతులు 347 ఎకరాల భూమిని ఇవ్వడానికి ముందుకువచ్చారు. మరింతమంది రైతులు ముందుకువచ్చినా వారి నుంచి భూమి తీసుకుని ఎకరానికి రూ.25 వేలు లీజును ప్రభుత్వం చెల్లిస్తుంది. -
సీట్లు 9,303.. భర్తీ 5,996
భీమవరం: ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయ్యే నాటికి జిల్లాలోని 22 కాలేజీలో కన్వీనర్ కోటాలో 9,303 సీట్లుకు 5,996 భర్తీ అయ్యాయి. 3,307 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఐదు కళాశాలల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. తొమ్మిది కళాశాలల్లో 50 శాతం వరకు, ఐదు కళాశాలల్లో 10 శాతంలోపు సీట్లు భర్తీ అయ్యాయి. తాడేపల్లిగూడెం ఆకుల శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. ఆల్ఫుల్ ..భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలో 1,050 సీట్లు, శ్రీవిష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో 504, ఏలూరు సీఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో 588, ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 336, తాడేపల్లిగూడెం శ్రీవాసవీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో 504 సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ అయ్యాయి. 50 శాతంకు పైగా.. భీమవరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (భీమవరం)లో 252 సీట్లకు 130, డీఎన్నార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (భీమవరం)లో 378 సీట్లకు 201, జీవీవీఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (భీమవరం) 294 సీట్లకు 153 సీట్లు భర్తీ అయ్యాయి. రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఏలూరు)లో 420 సీట్లకు 344, శశి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ (తాడేపల్లిగూడెం) 588 సీట్లకు 518 సీట్లు, స్వర్ణాంధ్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (నరసాపురం) 336 సీట్లకు 176 సీట్లు , స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (నరసాపురం) 588 సీట్లకు 461 సీట్లు భర్తీ అయ్యాయి. శ్రీవిష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ (భీమవరం) 504 సీట్లకు 497, వెస్ట్ గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (నల్లజర్ల) 252 సీట్లకు గాను 204 సీట్లు భర్తీ అయ్యాయి. అతి తక్కువగా.. తాడేపల్లిగూడెం ఆకుల శ్రీరాములు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 378 సీట్లకు ఒక్కటీ భర్తీ కాలేదు. తణుకు ఆకుల శ్రీరాములు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో 336 సీట్లకు 26 సీట్లు, భీమవరం చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో 210 సీట్లకు 4, ఏలూరులోని హేలాపురి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్స్ కళాశాలలో 252 సీట్లకు 20, పాలకొల్లులో జోగయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టñ క్నాలజీ అండ్ సైన్స్స్ కళాశాలలో 294 సీట్లకు 2, భీమవరంలో శ్రీవత్సవాయి కృష్ణంరాజు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 399 సీట్లకు 27 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.