మొక్కుబడికి వెళుతూ..మృత్యుఒడికి
మొక్కుబడికి వెళుతూ..మృత్యుఒడికి
Published Fri, Aug 19 2016 12:06 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
మేరీమాత గుడికి వెళుతూ ప్రమాదం
ఆటో ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
మృతుల్లో ముగ్గురు మూడేళ్లలోపు చిన్నారులే
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోరం
పుట్టిన బిడ్డకు పుట్టు వెంట్రుకలుతీయించాలని బయల్దేరారు... అన్నదమ్ముల బిడ్డలతోముస్తాబయ్యారు ...పిల్లల కేరింతలు ... ఇరుగు,పొరుగు అప్పగింతల మదయ ఆటోలో వెళ్లిన ఆ కుటుంబాలనుమృత్యువు వెంటాడింది...ఆలయానికి వెళ్లకముందే విషాదం అలుముకుంది...ముగ్గురు పసికందులతోపాటు పెద్దల్నీ చిదిమేసింది..ఆనంద విహారాన్ని కకావికలం చేసింది..
అమలాపురం టౌన్ / అయినవిల్లి :
వివిధ పనులపై హైదరాబాదు నుంచి అయినవిల్లి మండలం నేదునూరు శివారు పెదపేటకు వచ్చిన వారు ... ఆ పనులన్నీ ముగించి శుక్రవారం తిరుగుపయనమవ్వాలి ... ఈలోగా పిల్లాడి పుట్టు వెంట్రుకలు ఇచ్చి వెళ్దామనుకున్నారు. అన్న భార్య, పిల్లలతో సతీ సమేతంగా పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నానికి ఆటోలో గురువారం బయలుదేరిన రాజేంద్ర ప్రసాద్ కుటుంబం.. మొక్కు తీరకుండానే.. కొవ్వూరు మండలం బంగారమ్మపేట వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మృత్యువాత పడింది. వారు ప్రయాణిస్తున్న ఆటోను హెచ్‌పీ గ్యాస్ సిలెండర్ల లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో పి.రాజేంద్రప్రసాద్ (27), అతని భార్య శాంతి (24), వారి 14 నెలల కుమార్తె లెహన్యాతోపాటు రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య కుమారులు జీవన్ యాదాద్రి (3), వినయ్ బెహనర్ (2)లు మృతి చెందారు. మిగిలిన వారంతా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సొంతపనుల కోసం వచ్చి...
రాజేంద్ర ప్రసాద్ ఓ ప్రైవేటు ఉద్యో గం చేసుకుంటూ భార్య, కుమార్తెతో హైదరాబాదులో ఉంటున్నాడు. టైఫాయి డ్ జ్వరం రావటంతో విశ్రాంతితోపాటు సాధికార సర్వే చేయించుకోడానికి ఇక్కడకు వచ్చా డు. ఎలాగూ వచ్చాం కదా అని పుట్టు వెంట్రుక లు తీయించేద్దామని అందరూ ఆటోలో పయనమయ్యారు. మరో గంటలో మేరీమాత ఆలయానికి వెళతారనగా ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రేమను చిదిమేసిన విధి...
నేదునూరుకు చెందిన శాంతిని రాజేంద్రప్రసాద్ ప్రేమించి మూడేళ్ల కిందట పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. ఏడాది కిందటే పాప పుట్టింది. రెండు నెలల క్రితమే కూతురు పుట్టిన రోజు వేడుకను బంధువుల సమక్షంలో సందడిగా జరుపుకున్నారు. రెండు నెలల తరువాత మళ్లీ తన సొంత ఊరికి వచ్చిన ఈ కుటంబం ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవటం తట్టుకోలేకపోతున్నామని అతని తండ్రి వెంకట్రావు, బంధువులు బోరున విలపిస్తున్నారు.
మరదలికి తోడుగా వెళ్దామని...
మరదలికి తోడుగా వెళ్దామని వీరవేణి బయల్దేరింది. తామూ వస్తామని వెంటపడడంతో పిల్లలు జీవన్, వినయ్‌లను తీసుకువెళ్లింది. సందడిగా ఆటో ఎక్కిన ఆ పిల్లలిద్దర్నీ రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది. ఓ వైపు పిల్లలు విగతజీవులుగా మారారు ... ఇంకోవైపు భార్య అచేతనంగా ఆసుపత్రిలో పడి ఉంది. ఈ దుస్థితిని చూసిన భర్త రోదన అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.
వెళ్లే ముందు తమ్ముడికి రాఖీ కట్టి...
రాజేంద్రప్రసాద్ భార్య శాంతి గౌరీపట్నం బయలుదేరే ముందు ఊళ్లోని ఇంటర్మీడియట్ చదువుతున్న తమ్ముడు ఆనందకుమార్ చేతికి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టి మిఠాయి తినిపించింది. రాఖీ కట్టి ... ఆశీర్వదించిన రెండు గంటలకే అక్క చనిపోవడాన్ని తమ్ముడు తట్టుకోలేకపోతున్నాడు.
ఆగిపోయిన చిన్నారుల కేరింతలు...
రెండు,మూడేళ్ల వయసున్న ఆ చిన్నారులు ఆటోలో తమ తల్లుల ఒడిలో వేసిన కేరింతలు, చేసిన అల్లరి అంతలోనే ఆగిపోయింది. మనవళ్ల ఆనందాన్ని కళ్లారా చూసిన నాన్నమ్మ కన్నీళ్లపర్యంతమవుతోంది. క్షణంలోనే ఇంతటి క్షోభ పగవారికి కూడా వద్దంటూ విలపిస్తోంది.
Advertisement