పచ్చగడ్డితో అధిక పాల దిగుబడులు
Published Sun, Aug 7 2016 9:13 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : గేదెలు, ఆవుల పెంపకం ద్వారా ఉపాధి పొందుతున్న రైతులు సరైన పాల దిగుబడి రాక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వం అధ్యయనం చేయించిందని, పచ్చగడ్డి మేపడం ద్వారా అధిక పాల దిగుబడి వస్తుందని గుర్తించినట్టు పశు సంవర్థక శాఖ జిల్లా జేడీ కె.జ్ఞానేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో పశువులకు పచ్చగడ్డి మేపడం ద్వారా లీటర్ నుంచి లీటరున్నర వరకు అధిక పాలదిగుబడులు పొందవచ్చని, అందుకోసం జిల్లావ్యాప్తంగా పశుగ్రాస క్షేత్రాల పెంపకం చేపడుతున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పచ్చగడ్డి మేపడం ద్వారా పశువుల్లో పాల దిగుబడి అధికంగా వస్తుందని అధ్యయనంలో తేలడంతో రైతులకు పచ్చగడ్డి అందించేందుకు ఈ పశుగ్రాస క్షేత్రాల పెంపకంపై దృష్టి సారించింది. దీని కోసం ప్రభుత్వం జిల్లాలోని రైతుల నుంచి భూమిని సేకరిస్తోంది. సేకరించిన భూమిలో పశుగ్రాసం పెంచడం ద్వారా అటు పశుగ్రాస పెంపకం రైతులకు, ఇటు పాడి రైతులకు లాభాలు వచ్చే అవకాశముండడంతో ఈ క్షేత్రాలపై రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పశుగ్రాస క్షేత్రాల కోసం భూమి సేకరణ
జిల్లాలో పశుగ్రాస క్షేత్రాల పెంపు కోసం భూ సేకరణ చేపడుతోంది. అన్నివేళలా నీరు సమ్రుద్ధిగా ఉండి వ్యవసాయం చేయని భూ యజమానుల నుంచి ఈ క్షేత్రాల కోసం భూమి సేకరిస్తోంది. అయితే ఈ భూమిని లీజు ప్రాతిపదికన మాత్రమే తీసుకుంటోంది. ఈ మేరకు కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఇటీవల సంబంధిత అధికారులతో చర్చలు నిర్వహించిన అనంతరం పశుగ్రాస క్షేత్రాలకు భూమి ఇచ్చే రైతులకు ఎకరానికి సాలుకు రూ. 25 వేలు లీజు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
రైతులు, స్వయం సహాయక సంఘాలకు భూమి
ప్రభుత్వం నిర్ణయించిన ఈ లీజు ధరకు భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చే రైతుల నుంచి భూమిని సేకరిస్తారు. భూమి ఇచ్చిన రైతులు ముందుకు వస్తే పశుగ్రాస క్షేత్రాలను వారే పెంచుకోవచ్చు. వారికి ఆసక్తి లేకపోతే ఆయా ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలకు ఈ భూమిని అప్పగిస్తారు. ఈ భూమిలో పశుగ్రాసం పెంచి ఆ ప్రాంతంలోని రైతులకు పచ్చగడ్డిని ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పాడి రైతులకు అందచేయాల్సి ఉంటుంది.
కిలో రూపాయికే పచ్చగడ్డి
పశుగ్రాస క్షేత్రాల్లో పెంచే పచ్చగడ్డిని ఆ ప్రాంతంలోని పాడి రైతులకు కిలో రూపాయికే ఇవ్వాలని కలెక్టర్ కె.భాస్కర్ ప్రభుత్వ ధరగా నిర్ణయించారు. ఎకరం పొలంలో పండించే పశుగ్రాసం ఏడాది పొడవునా ఆయా ప్రాంతాల్లోని పాడి రైతులకు ఒక్కో పశువుకు రోజుకు 20 కిలోలు చొప్పున సరఫరా చేస్తే సరిపోతుందని అంచనా వేశారు.
పాతర గడ్డి/సైలేజ్ గడ్డి
పండిన పచ్చగడ్డి స్థానిక రైతుల అవసరాలకు పోను మిగిలితే రాయలసీమ ప్రాంతాలకు ఎగుమతి చేయవచ్చు. పచ్చగడ్డిని ముక్కలుగా చేసి పులిసిపోకుండా ప్రాసెస్ చేసి గాలి చొరబడకుండా ప్లాస్టిక్ సంచుల్లో ప్యాకింగ్ చేస్తే అది తాజా పచ్చగడ్డిలా ఎన్నాళ్లైనా నిలువ ఉంటుంది. అలా నిల్వ చేసి అవసరమైన వారికి ఎగుమతి చేసుకోవచ్చు. ఈ సైలేజ్ గడ్డిని కిలో రూ.2కు విక్రయించుకోవచ్చు. ఈ పశుగ్రాస క్షేత్రాల్లో పండించే పచ్చగడ్డిపై రైతుకు కిలోకు గరిష్టంగా 40 పైసలు, కనిష్టంగా 25 పైసలు ఆదాయం లభిస్తుంది.
భూసేకరణకు దరఖాస్తుల ఆహ్వానం
జిల్లా వ్యాప్తంగా పశుగ్రాస క్షేత్రాల పెంపకం కోసం భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాం. ఇప్పటివరకూ జిల్లాలోని 72 గ్రామాల నుంచి సుమారు 160 మంది రైతులు 347 ఎకరాల భూమిని ఇవ్వడానికి ముందుకువచ్చారు. మరింతమంది రైతులు ముందుకువచ్చినా వారి నుంచి భూమి తీసుకుని ఎకరానికి రూ.25 వేలు లీజును ప్రభుత్వం చెల్లిస్తుంది.
Advertisement
Advertisement