సాక్షి ప్రతినిధి, ఏలూరు : తుందుర్రు ఆక్వా ఫుడ్‌పార్క్ బాధితులకు బాసటగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం చేపట్టిన జిల్లా పర్యటన విజయవంతమైంది. అడుగడుగునా ప్రజలు ఆయనకు నీరాజనాలు పలికారు. ప్రతి గ్రామానా ఘనస్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. జయహో జగన్ అంటూ నినదించారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయలుదేరిన జననేత కలపర్రు టోల్‌గేట్ వద్దకు చేరుకోగానే ఏలూరు నేతలు గుడిదేశి శ్రీనివాస్, మంచం మైబాబు, బొద్దాని శ్రీనివాస్ నేతృత్వంలో వంద కార్ల ర్యాలీతో కార్యకర్తలు, ప్రజలు జననేతకు ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం దెందులూరు వద్ద పార్టీ ఆ నియోజకవర్గ కన్వీనర్‡ కఠారి రామచంద్రరావు నేతృత్వంలో ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోమటిలంకతోపాటు పలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు.
గుండుగొలను జంక్షన్, కైకరం, పూళ్ల, నారాయణపురంలలో ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు నేతృత్వంలో జగనన్నకు కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. తాడేపల్లిగూడెం బైపాస్ వద్ద తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వాగతం పలికారు. అక్కడ కొట్టు సత్యనారాయణకు జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి దువ్వ మీదుగా తణుకు సబ్ జైలుకు చేరుకునే సరికి మధ్యాహ్నం 12 గంటలు అయింది. అక్కడ తుందుర్రు పోరాటంలో అరెస్టయిన ఆరేటి సత్యవతిని జగన్ పరామర్శించారు. అనంతరం అక్కడ ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న సీపీఎం నేతలకు సంఘీభావం తెలిపారు. ఒంటిగంటకు తుందుర్రుకు బయలుదేరిన జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. దీంతో తణుకు నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీమవరం చేరడానికి నాలుగు గంటల సమయం పట్టింది. వేల్పూరు, రేలంగి, అత్తిలి, పాలూరు, కొమ్మర, ఈడూరు, కోరుకొల్లు, మోగల్లు, పాలకోడేరు మీదుగా జగన్‌మోహన్‌రెడ్డి భీమవరం చేరుకున్నారు. మధ్యలో అభిమానుల కోరిక మేరకు అంబేడ్కర్, రంగా, వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. గునుపూడి, తాడేరు, బేతపూడి మీదుగా తుందుర్రు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి అక్కడి ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆయన రాక కోసం ఉదయం నుంచే వేలాది మంది బాధితులు వేయి కనులతో నిరీక్షించారు. తుందుర్రు, బేతపూడి, జొన్నల గరువుతోపాటు గొంతేరు కాలుష్యం వల్ల ఇబ్బంది పడే తీరప్రాంత గ్రామాల ప్రజలూ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫ్యాక్టరీ వద్దంటూ నినదిస్తూ ముందుకుసాగారు. తుందుర్రు నుంచి బేతపూడి వరకూ సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ప్రదర్శనగా జగన్‌మోహన్‌రెడ్డి వెంట ప్రజలు నడిచారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారథి, రాష్ట్ర ప్రోగామింగ్ కమిటీ కన్వినర్ తలశిల రఘురామ్, నేతలు వంకా రవీంద్రనాథ్, మేకా శేషుబాబు, కారుమూరి నాగేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, తెల్లం బాలరాజు, ఘంటా మురళీరామకృష్ణ, తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, తలారి వెంకటరావు, కఠారి రామచంద్రరావు, పుప్పాల వాసుబాబు, కవురు శ్రీనివాస్, గుణ్ణం నాగబాబు, పిళ్లంగోళ్ల శ్రీలక్ష్మి, సాయిబాల పద్మ, కొయ్యె మోషేన్ రాజు, కారుమంచి రమేష్, దిరిశల కృష్ణ శ్రీనివాస్, ఉదరగొండ చంద్రమోళి, బొద్దాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.