ఏలూరు (సెంట్రల్): పోలీసు కానిస్టేబుల్‌గా చెలామణి అవుతూ పేకాట స్థావరాల నుంచి వసూళ్లుకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఓ వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో మొత్తం డొంక అంత కదిలినట్టు తెలిసింది. ఏలూరు ఆర్‌ఆర్ పేటకు చెందిన సదరు వ్యక్తి నుంచి పోలీసు దుస్తుల్లో దిగిన ఫొటోలు, నకిలీ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సదరు వ్యక్తిని మూడు రోజులుగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎస్సై, సీఐల తలలో నాలుకలా ఉంటూ..
నిందితుడు గతంలో నగరంలోని ఓ స్టేషన్‌లో పనిచేసి బదిలీపై వెళ్లిన ఇన్‌స్పెక్టర్‌కు తలలో నా లుకలా ఉండేవాడు. ఆ అధికారి జీపులోనే తిరుగుతూ బయటవారికి కానిస్టేబుల్‌గా పరిచయం అయ్యాడు. సదరు అధికారికి మామూళ్లను తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించేవాడని కొందరు పోలీసు సిబ్బంది చెబుతున్నారు. సదరు ఇన్‌స్పెక్టర్ అక్కడ నుంచి బదిలీ అయిన కొన్ని రోజులకు ఏలూరుకు ఆనుకొని ఉన్న ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వద్దకు మకాం మార్చాడు. ఆ అధికారి వద్దనే తిరుగుతూ ఆ సర్కిల్ పరిధిలో జరిగే పేకా ట, కోడి పందాల స్థావరాల నుంచి డబ్బులు వ సూళ్లకు పాల్పడేవాడు. ఈ విషయం సదరు అధికారికి తెలియడంతో మందలించి పంపించి వేసినట్టు సమాచారం.
వివాహిత ఫిర్యాదుతో కదిలిన డొంక
నిందితుడు తాను పోలీసు కానిస్టేబుల్‌ని అని చెబుతూ ఓ వివాహితతో పరిచయం పెంచుకుని ఆమెను లొంగదీసుకున్నాడు. సదరు వివాహితను కొన్నిరోజులుగా వేధింపులకు గురి చేయడంతో పాటు ఆమెకు సంబంధించిన ఆస్తి పత్రాలపై సం తకాలు చేయించుకోవడంతో ఆమె టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పం దించిన పోలీసులు అతడిని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. నగరంలోని పలువురు పోలీసు సిబ్బందినీ అతడు జిల్లాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ అని బురిడీ కొట్టించినట్టు విచారణలో తేలింది. రాత్రిళ్లు ఓ వ్యక్తి వాహనచోదకుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులతో సదరు వ్యక్తికి దీనికి సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment