చీమకుర్తి మీదుగా విజయవాడ వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి జిల్లాలోనుంచి కాన్వాయ్‌తో తీసుకెళుతుంటే అటు ప్రజల నుంచి కానీ, ఇటు సొంత పార్టీ టీడీపీ నాయకుల నుంచి కానీ స్పందన కరువైంది. 4.20 గంటల పాటు జిల్లాలో చంద్రబాబు కాన్వాయ్ ప్రయాణించింది. దాదాపు 175 కిలో మీటర్లు ప్రయాణించినా కూడా చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న దాఖలాలు శూన్యం. చీమకుర్తి మండలంలో ఒకటి, రెండు చోట్ల మినహా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దగా చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. జిల్లాలో ఆర్టీసీ బస్సులు తిరిగాయి. వ్యాపార సంస్థలు సైతం తెరిచే ఉంచారు.
ఎక్కడా జనం కనిపించకపోవడంతో చంద్రబాబు సైతం ఢీలా పడ్డారు. జనం కనపడితే ఎప్పపుడూ విక్టరీ సింబల్ చూపించే ఆయన కాన్యాయ్ వెళుతున్న ప్రధాన కూడళ్లలో అరకొరగా ఉన్న జనాన్ని, పార్టీ నాయకుల్ని చూస్తూ ముందుకు వెళ్లిపోయారు. ఈ స్కాంలో చంద్రబాబు తప్పుచేశాడన్న భావన ఆపార్టీ నేతల్లో సైతం వ్యక్తమైనట్టుగా తెలుస్తోంది. నంద్యాల నుంచి జిల్లాలోని గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామంలోకి ఉదయం 8.45 గంటలకు చంద్రబాబు కాన్వాయ్ ప్రవేశించింది. అక్కడ నుంచి గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నుంచి కాన్వాయ్ మధ్యాహ్నం 1.05 గంటలకు జిల్లా సరిహద్దులు దాటింది.
జిల్లాలో దాదాపు 100కు పైగా గ్రామాల్లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా కాన్వాయ్ సాగింది. తొలుత గిద్దలూరు నియోజకవర్గంలోని దిగువమెట్ట వద్ద చంద్రబాబు కాన్వాయ్ ప్రవేశించింది. అయితే గిద్దలూరు నియోజకవర్గ ప్రజల నుంచి కానీ టీడీపీ నాయకులు, కార్యకర్తల నుంచి కానీ ఎలాంటి కనీస స్పందన కరువైంది. మార్కాపురం నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగింది. జిల్లా కేంద్రం ఒంగోలులో కూడా ఆ పార్టీ కేడర్ నుంచే స్పందన కానరాలేదు.
టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం..
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడని టీడీపీ శ్రేణుల్లోనే నైరాశ్యం నెలకొంది. విజయవాడ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి జిల్లాలో ఆయన కాన్వాయ్ వెళుతున్నా ఆ పార్టీ నాయకుల్లో కూడా కనీసం కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదంటే కుంభకోణం తీవ్రత ఎంతో టీడీపీ నాయకులే అర్థం చేసుకున్నట్లు ఉన్నారు.
భగ్గుమంటదని ఎల్లో మీడియా ఊదర...
చంద్రబాబును అరెస్ట్ చేస్తే రాష్ట్రం భగ్గుమంటుందని ఎల్లో మీడియా ఊదర గొట్టింది. జనాలు స్వచ్ఛందంగా రోడ్డు ఎక్కుతారని ఎల్లో మీడియా ప్రచారం చేసింది. అయితే అందుకు భిన్నంగా జిల్లాలో శనివారం కాన్వాయ్ వెళ్లినా ప్రజల్లో కనీస స్పందన కూడా లేదు. టీడీపీలో కూడా తూతూ మంత్రంగా ఒకటి రెండు చోట్ల మాత్రమే కాన్వాయ్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించారు.
చీమకుర్తి బైపాస్‌లో, పేర్నమిట్ట వద్ద కొద్దిమంది రోడ్డు మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేయాలని పూనుకున్నారు. పోలీసులు అప్రమత్తమై నిరసనకారులను చెదరగొట్టారు. జిల్లా కేంద్రం ఒంగోలులో పార్టీ ఆఫీసు వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు తప్ప మరెలాంటి ఆందోళనలుకానీ, నిరసనలు కానీ చేపట్టలేదు. చంద్రబాబు కాన్వాయ్‌కి ఎలాంటి ఆటంకాలు లేకుండా జిల్లాలో సజావుగా సాగిపోయింది. చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం, రామతీర్థం మధ్యలో 15 నిమిషాల పాటు చంద్రబాబు కాలకృత్యాలు తీర్చుకోవటానికి మాత్రమే పోలీసులు ఆపారు. అంతకు మినహా జిల్లాలో ఎక్కడా చంద్రబాబు కాన్వాయ్‌కు ఆటంకాలు ఏర్పడలేదు.
పకడ్బందీగా బందోబస్తు
ఒంగోలు టౌన్: వందలాది కోట్ల రూపాయల స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును నంద్యాలలో అరెస్టు చేసిన సమాచారం తెలిసిన వెంటనే జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ మలికా గర్గ్ పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. చంద్రబాబును శనివారం ఉదయం నంద్యాల నుంచి ఒంగోలు మీదుగా విజయవాడకు తరలిస్తున్నారన్న సమాచారం అందగానే పోలీసు అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. జిల్లాలోకి ప్రవేశించిన నప్పటి నుంచి జిల్లా దాటి వెళ్లే వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు సూచించారు. ఉదయం 8.45 నిమిషాలకు జిల్లాలోకి ప్రవేశించిన కాన్వాయ్ గిద్దలూరు, బేస్తవారిపేట జంక్షన్, పొదిలి, చీమకుర్తి, సంతనూతలపాడు గుండా ఒంగోలుకు చేరుకుంది.
ఒంగోలు నుంచి హైవే మీదుగా మద్దిపాడు గ్రోత్ సెంటర్ నుంచి చిలకలూరిపేట మీదుగా కాన్వాయ్ విజయవాడ వెళ్లింది. జిల్లాలో ప్రవేశించిన కాన్వాయ్‌కు దారిమధ్యలో ఎలాంటి ఆటంకాలు, అసౌకర్యం కలగకుండా పోలీసులు తగిన బందోబస్తు చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ పికెట్లు, చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించడానికి ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులను హౌస్ అరెస్టు చేశారు. ఆ పార్టీకి చెందిన 90 మంది ద్వితీయ శ్రేణి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు మహిళలు కొందరు నిరసన ప్రదర్శనలు చేసేందుకు ప్రయత్నించి ప్రజల మద్దతు లేకపోవడంతో మిన్నకుండిపోయారు. నగరంలోని పాత మార్కెట్ వద్ద కొందరు టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. అద్దంకి బస్టాండు సెంటర్‌లో ధర్నాకు విఫలయత్నం చేశారు. ఒంగోలులోని గుంటూరు రోడ్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పికెట్లను ఏర్పాటు చేశారు.
నగరంలోకి ప్రవేశించే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కట్టడి చేశారు. ఏఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, డీఎస్పీ వి.నారాయణస్వామి రెడ్డిల పర్యవేక్షణలో సీఐలు పి.భక్తవత్సలరెడ్డి, టి.వెంకటేశ్వరరావు, జగదీష్, శ్రీనివాసరెడ్డిలతో పాటు మొత్తం 200 మంది కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment