ఇంటి గోడల నుంచి వెండి నాణేల లభ్యం
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలంలోని ఎ.పోలవరంలో పాడుపడిన ఇంటిlగొడలను శుక్రవారం కూల్చివేస్తుండగా వెండి నాణేలు బయటపడ్డాయి. ఇంటి యజమాని ఇంటిని పొక్లైనర్‌తో పడగొడుతున్న సమయంలో గోడల్లో నుంచి కుండలు బయల్పడ్డాయి. కిందపడిన ఈ కుండలు పగలడంతో వెండి నాణేలు బయటకు వచ్చాయి. ఇంటి యజమాని వెంటనే పనులు నిలుపుదల చేయించి పొక్లైనర్‌ను పంపించి వేశారు. ఇంటి పరిసరాల్లో తవ్వకాలు చేస్తే మరిన్ని నాణేలు బయటపడే అవకాశాలు ఉన్నాయని కొందరు ఆశావహులు ఆ పరిసరాల్లో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి యజమాని పడగొట్టిన ఇంటి ప్రాంతంలోనే జాగారం చేస్తున్నారు. ఈ వెండి నాణేలు 1907 సంవత్సరం కాలం నాటి రూపాయి నాణేలు, పులిబొమ్మ , బ్రిటిష్ రాజు, ఓంకారం ఉన్న నాణేలు లభ్యమైనట్టు స్థానికులు తెలిపారు. అయితే ఎన్ని నాణేలు ఉన్నాయో తెలియలేదు. దీనిపై అధికారులకు కూడా ఎటువంటి సమాచారం లేదు. కొందరు చిన్నారులు కొన్ని నాణేలను తీసుకెళ్లారని, కుండలో వెండి నాణేలతో పాటు బంగారు నాణేలు కూడా ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.