కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు
కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు
Published Sat, Aug 6 2016 9:36 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
సంగమేశ్వరం(కొత్తపల్లి): సప్తనదీ తీరాన వెలసిన శ్రీలలితా సంగమేశ్వరుడు 571రోజులపాటు పూజలందుకొని శుక్రవారం అర్ధరాత్రి కృష్ణమ్మ ఒడిలో ఒదిగి పోయాడు. శనివారం ఉదయం సప్తనదుల నదీ జలాలతో శ్రీలలితాసంగమేశ్వరుని ఆలయ మహాశిఖరంపై అర్చకుడు తెల్కపల్లి రఘురామశర్మ ఈ ఏడాదికిగాను చివరి పర్యాయంగా హోమం నిర్వహించి సప్తనదీ జలాలతో స్వామివారి మహాశిఖరానికి వేదమంత్రాల మధ్య అభిషేకం నిర్వహించారు. అనంతరం లలితా సంగమేశ్వరునికి మహామంగళహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శ్రావణమాసం శుక్రవారం రోజున కృష్ణాజలాల్లో శ్రీలలితాసంగమేశ్వరుడు ఒదిగిపోవటం, కృష్ణాజలాల్లో సంగమేశ్వరుడు ఒదిగిన దినాన్నే(శుక్రవారం) కృష్ణాపుష్కరాలు కూడా ప్రారంభం కావటం అద్భుతమన్నారు. పుష్కరాల సందర్భంగా ఈనెల 22న శ్రీలలితా సంగమేశ్వరునికి అంగరంగ వైభోవంగా కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఎగువప్రాంతాల నుంచి అత్యధికంగా వచ్చి చేరుతున్న కష్ణాజలాలతో సంగమేశ్వరాలయంలో పుష్కరఘాట్లు మునిగిపోయాయి. ప్రస్తుతం ఎగువ స్నానఘాట్‌లో పదిమెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
Advertisement