2020 నాటికి కోటిపల్లి రైల్వేలైన్‌కు ఓ రూపు
2020 నాటికి కోటిపల్లి రైల్వేలైన్‌కు ఓ రూపు
Published Fri, Nov 4 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM
నరసాపురం : కోటిపల్లినరసాపురం రైల్వేలైన్‌కు 2020 నాటికి ప్రాథమికంగా ఓ రూపు వస్తుందని దక్షణ మధ్య రైల్వే (సికింద్రాబాద్) జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా తెలిపారు. శుక్రవారం నరసాపురం రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కోటిపల్లి రైల్వేలైన్‌కు సంబంధించి మూడు బ్రిడ్జిల నిర్మాణం ముందుగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. గౌతమి నదిపై రైల్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. వైనతేయి, వశిష్ట నదులపై రైలు వంతెనల నిర్మాణాలపై ఎలాంటి కదలిక లేదన్నారు. ఈ మూడు బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తవ్వడానికే 30, 40 నెలలు పడుతుందని పేర్కొన్నారు.
నరసాపురం రైల్ కం బ్రిడ్జి లేదు
నరసాపురంలో రైల్ కం వంతెన నిర్మాణ ప్రతిపాదనలు లేవన్నారు. కోటిపల్లి రైల్వేలైన్‌కు సంబంధించి నరసాపురంలో రైల్ కమ్ బ్రిడ్జి లింక్ ఉండదన్నారు. చించినాడ బ్రిడ్జి వద్దే సమాంతరంగా రైల్ బ్రిడ్జి నిర్మించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎక్కడా రైల్‌కమ్‌బ్రిడ్జిల ప్రతిపాదనలు లేవని చెప్పారు. అలాగే ఆర్‌వోబీల నిర్మాణాల ప్రతిపాదనలు కూడా లేవన్నారు. ఆయన వెంటన రైల్వే డీజీఎం (విజయవాడ) అశోక్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
Advertisement