విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నారాయణ
జిల్లాలో ఎండిపోయిన వేరుశనగ పంటకు శుక్రవారం సాయంత్రం లోపు మొదటి దశ తడులివ్వడం పూర్తిచేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.
– మంత్రి నారాయణ
చిత్తూరు (కలెక్టరేట్):
జిల్లాలో ఎండిపోయిన వేరుశనగ పంటకు శుక్రవారం సాయంత్రం లోపు మొదటి దశ తడులివ్వడం పూర్తిచేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మంత్రి సిద్ధారాఘవరావు, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులుతో కలసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. గత పదిరోజులుగా ఎండిపోయిన వేరుశనగ పంటకు రెయిన్ గన్స్ సాయంతో రోజుకు 2వేల హెక్టార్ల మేరకు తడులిస్తున్నామన్నారు. గురువారం నాటికి 17,739 ఎకరాలకు గాను 8,353 ఎకరాలకు తడులు పూర్తిచేశామని, మిగిలిన 9,386 ఎకరాలకు శుక్రవారం సాయంత్రానికి పూర్తి చేస్తామన్నారు. ఆలస్యంగా వేరుశనగ పంట వేసుకున్న రైతులకు ఈనెల 5 నుంచి తడులు ఇస్తామని, ఇప్పటివరకు పూర్తి చేసిన మొదటి విడత పంటలకు 15వతేదీ నుంచి రెండో విడత తడులిస్తామన్నారు. వేరుశనగ పంటను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చేపడుతున్న చర్యలపై అవగాహన పొందేందుకు వివిధ నియోజకవర్గాలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం జిల్లాకు విచ్చేయనున్నారని తెలిపారు. ఆ తర్వాత వారు తమ ప్రాంతాల్లో రెయిన్ గన్స్ ద్వారా పంటలను కాపాడుకునేందుకు చర్యలు చేపడుతారన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, జేసీ గిరీషా, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.