కడప తాడిపత్రి ప్రధాన రహదారిపై మండలంలోని తప్పెట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థినులు గాయపడ్డారు. స్థానికులందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
వల్లూరు: కడప తాడిపత్రి ప్రధాన రహదారిపై మండలంలోని తప్పెట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థినులు గాయపడ్డారు. స్థానికులందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గంగాయపల్లెలోని ఏపీ మోడల్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థినులు రోజూ లాగే సాయంత్రం పాఠశాల నుంచి ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా టైర్ పంక్చర్ అయింది. దీంతో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుని వెళ్లి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న లేబాకకు చెందిన భవాని, చందన, బుజ్జి, సౌజన్య, శ్రీవిద్య గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ దిలీప్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 వాహనం ద్వారా వారిని కడప రిమ్స్‌కు తరలించారు. బాధితులను ప్రిన్సిపాల్‌తోపాటు పలువురు ఉపాధ్యాయులు పరామర్శించారు. కాగా ఆటో బ్రిడ్జి దిగిన తరువాత పంక్చర్ కావడం వలన పెద్ద ప్రమాదం తప్పింది. కేవలం 40 మీటర్ల ముందు వున్న బ్రిడ్జిపై ప్రమాదం జరిగి వుంటే ఎక్కువ నష్టం జరిగేది.