బాణసంచా అక్రమ తయారీపై కఠిన చర్యలు
ఏలూరు అర్బన్ : జిల్లాలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ హెచ్చరించారు. ఆయన శుక్రవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీపావళి పండుగను ప్రజలంతా సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. దీనికోసం పోలీసుశాఖ రక్షణ చర్యలు చేపట్టిందని వెల్లడించారు. అక్రమ బాణసంచా తయారీ కేంద్రాలపై పోలీసులకు ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫోన్‌కాల్స్‌ను స్వీకరించిన ఆయన ప్రజల సమస్యలను విన్నారు. బుట్టాయిగూడెం నుంచి ఫోన్ చేసిన ఓ వ్యక్తి గ్రామంలో పేకాట యథేచ్ఛగా సాగుతోందని, దానిని నిరోధించాలని కోరారు. ఏలూరులో ట్రాఫిక్ నియంత్రించాలని మరో వ్యక్తి విజ్ఞప్తి చేశారు. కైకరంలో ఒకవ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడని ఆ గ్రాముస్తడు ఫిర్యాదు చేశారు. దెందులూరులో ఆటోలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. మొత్తం 15 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు.