ఏలూరు(సెంట్రల్) : తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఎస్పీ భాస్కర్ భూషణ్ శుక్రవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక వన్‌టౌన్‌లోని మోతేపల్లి వారి వీధి రామాలయం వద్ద నివాసం ఉండే గొల్లపల్లి నాగ మల్లేశ్వరరావు అలియాస్ మల్లి, తూర్పుగోదావరి జిల్లా కాజులూరు గ్రామానికి చెందిన షేక్ అజీజ్‌లిద్దరూ కలిసి ఏలూరు సబ్‌డివిజన్ పరిధిలోని భీమడోలు, ఏలూరు రూరల్, టూటౌన్, చేబ్రోలు, దెందులూరు, ఉండ్రాజువరం పోలీసుస్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఈ కేసుల దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం భీమడోలు, ఏలూరు రూరల్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. భీమడోలు రైల్వే గేటు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న గొల్లపల్లి నాగమల్లేశ్వరరావుతోపాటు, అతని బాబాయ్‌లు గొల్లపల్లి నాగరాజు, దాసరి బోసురాజును అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నాగమల్లేశ్వరరావు, అజీజ్‌లిద్దరూ కలిసి పలు దొంగతనాలకు పాల్పడినట్టు, వారికి నాగరాజు, బోసురాజు, అజీజ్ భార్య సమీరా, తల్లి అస్లాంబేగ్, తండ్రి మస్తాన్ సాహెబ్ సహకరించినట్టు గుర్తించారు. దీంతో శుక్రవారం ఉదయం పోలీసులు కాజులూరు వెళ్లి అజీజ్ భార్య సమీరా, తల్లి స్లాంబేగ్‌ను అరెస్ట్ చేశారు. మస్తాన్ సాహెబ్ పరారాయ్యాడు. అరెస్టయిన ఐదుగురు నిందితుల వద్ద పోలీసులు రూ. 21 లక్షల 76 వేలు నగదు, 440 గ్రాముల బంగారం, కిలో వెండి ఇళ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలు, లారీ రికార్డులు స్వాధీనం చేసున్నారు. ఈ సొత్తు విలువ రూ.60 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు.
మొత్తం 17 చోరీలు
గొల్లపల్లి నాగమల్లేశ్వరరావు, షేక్ అజీజ్ కలిసి ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 17 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసు విచారణలో తెలింది. ఈ చోరీల్లో సుమారు రూ.64 లక్షలు విలువైన సొత్తును దొంగిలించినట్టు తెలిసింది. వీరిద్దరూ కొన్ని చోరీల అనంతరం డబ్బు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను పంచుకుంటారని, కొంతకాలం ఖాళీగా ఉండి తిరిగి దొంగతనాలకు పాల్పడుతుంటారని పోలీసులు చెబుతున్నారు.
చోరీ సొత్తుతో ఇళ్ల స్థలాలు, లారీ కొనుగోలు
పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. షేక్ అజీజ్ ఇళ్ల స్థలాలు, లారీ కొన్నట్టు తేలింది. అతను చోరీ సొమ్ముతో భార్య సమీరా, తండ్రి మస్తాన్ సాహేబ్ పేరిట రూ.15 లక్షలతో నర్సీపట్నంలో ఐదు సెంట్లు ఇళ్ల స్థలం కొన్నాడు. మరోచోట ఇళ్లస్థలం కొనేందుకు రూ.3 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. రూ.6 లక్షలతో ఓ లారీనీ కొన్నాడు. అతని బ్యాంకు ఖాతాలో రూ.లక్ష ఉంది. దీనిని పోలీసులు సీజ్ చేశారు. చోరీ సొత్తును దాచిపెట్టడానికి అజీజ్‌కు తల్లి అస్లాంబేగ్, భార్య సమీరా, తండ్రి మస్తాన్ సహకరించేవారు. నాగమల్లేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం కాజులూరు వెళ్లి అజీజ్ భార్య షేక్ సమీరా, తల్లి షేక్ అస్లీమబేగంను అరెస్ట్ చేశారు. అజీజ్ తండ్రి షేక్ మస్తాన్ సాహేబ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఓ చోరీ కేసులో అరెస్టయిన అజీజ్ నెల రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
హత్యకేసుల్లోనూ నిందితుడు
అరెస్టయిన నాగమల్లేశ్వరరావు చోరీ సొత్తును అతని బాబాయ్‌లు ఏలూరు తూర్పువీధికి చెందిన గొల్లపల్లి నాగరాజు, జంగారెడ్డిగూడెంకు చెందిన దాసరి బోసురాజు వద్ద దాచేవాడు. నాగ మల్లేశ్వరరావుపై విశాఖపట్నం జిల్లాలో రెండు హత్య కేసులు ఉన్నట్టు పోలీసులు చెప్పారు.
ఫిర్యాదు సక్రమంగా ఇవ్వాలి
ఎక్కడైనా చోరీ జరిగితే బాధితులు ఫిర్యాదులో పోయిన వస్తువులు, నగదు వివరాలు సక్రమంగా ఇవ్వాలని ఎస్పీ భాస్కర్‌భూషణ్ కోరారు. ఇటీవల రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఫిర్యాదుదారు తన ఇంట్లో రూ.10వేలు చోరీకి గురైతే రూ.3లక్షలు పోయినట్టు ఫిర్యాదు ఇచ్చారని, ఇలా చేయడం వల్ల విచారణ సరిగా సాగదని పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన భీమడోలు సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై బి.వెంకటేశ్వరరావు, రూరల్ ఎస్సై ఎం.వి.సుభాష్, హెడ్‌కానిస్టేబుళ్లు షేక్ అమీర్, బండారు నానిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్‌బీ డీఎస్పీ భాస్కరరావు, సీఐ చిన్ని కొండలరావు పాల్గొన్నారు.