sp told
-
దొంగల ముఠా అరెస్ట్
ఏలూరు(సెంట్రల్) : తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఎస్పీ భాస్కర్ భూషణ్ శుక్రవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక వన్‌టౌన్‌లోని మోతేపల్లి వారి వీధి రామాలయం వద్ద నివాసం ఉండే గొల్లపల్లి నాగ మల్లేశ్వరరావు అలియాస్ మల్లి, తూర్పుగోదావరి జిల్లా కాజులూరు గ్రామానికి చెందిన షేక్ అజీజ్లిద్దరూ కలిసి ఏలూరు సబ్‌డివిజన్ పరిధిలోని భీమడోలు, ఏలూరు రూరల్, టూటౌన్, చేబ్రోలు, దెందులూరు, ఉండ్రాజువరం పోలీసుస్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఈ కేసుల దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం భీమడోలు, ఏలూరు రూరల్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. భీమడోలు రైల్వే గేటు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న గొల్లపల్లి నాగమల్లేశ్వరరావుతోపాటు, అతని బాబాయ్‌లు గొల్లపల్లి నాగరాజు, దాసరి బోసురాజును అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నాగమల్లేశ్వరరావు, అజీజ్లిద్దరూ కలిసి పలు దొంగతనాలకు పాల్పడినట్టు, వారికి నాగరాజు, బోసురాజు, అజీజ్ భార్య సమీరా, తల్లి అస్లాంబేగ్, తండ్రి మస్తాన్ సాహెబ్ సహకరించినట్టు గుర్తించారు. దీంతో శుక్రవారం ఉదయం పోలీసులు కాజులూరు వెళ్లి అజీజ్ భార్య సమీరా, తల్లి స్లాంబేగ్ను అరెస్ట్ చేశారు. మస్తాన్ సాహెబ్ పరారాయ్యాడు. అరెస్టయిన ఐదుగురు నిందితుల వద్ద పోలీసులు రూ. 21 లక్షల 76 వేలు నగదు, 440 గ్రాముల బంగారం, కిలో వెండి ఇళ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలు, లారీ రికార్డులు స్వాధీనం చేసున్నారు. ఈ సొత్తు విలువ రూ.60 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. మొత్తం 17 చోరీలు గొల్లపల్లి నాగమల్లేశ్వరరావు, షేక్ అజీజ్ కలిసి ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 17 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసు విచారణలో తెలింది. ఈ చోరీల్లో సుమారు రూ.64 లక్షలు విలువైన సొత్తును దొంగిలించినట్టు తెలిసింది. వీరిద్దరూ కొన్ని చోరీల అనంతరం డబ్బు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను పంచుకుంటారని, కొంతకాలం ఖాళీగా ఉండి తిరిగి దొంగతనాలకు పాల్పడుతుంటారని పోలీసులు చెబుతున్నారు. చోరీ సొత్తుతో ఇళ్ల స్థలాలు, లారీ కొనుగోలు పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. షేక్ అజీజ్ ఇళ్ల స్థలాలు, లారీ కొన్నట్టు తేలింది. అతను చోరీ సొమ్ముతో భార్య సమీరా, తండ్రి మస్తాన్ సాహేబ్ పేరిట రూ.15 లక్షలతో నర్సీపట్నంలో ఐదు సెంట్లు ఇళ్ల స్థలం కొన్నాడు. మరోచోట ఇళ్లస్థలం కొనేందుకు రూ.3 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. రూ.6 లక్షలతో ఓ లారీనీ కొన్నాడు. అతని బ్యాంకు ఖాతాలో రూ.లక్ష ఉంది. దీనిని పోలీసులు సీజ్ చేశారు. చోరీ సొత్తును దాచిపెట్టడానికి అజీజ్‌కు తల్లి అస్లాంబేగ్, భార్య సమీరా, తండ్రి మస్తాన్ సహకరించేవారు. నాగమల్లేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం కాజులూరు వెళ్లి అజీజ్ భార్య షేక్ సమీరా, తల్లి షేక్ అస్లీమబేగంను అరెస్ట్ చేశారు. అజీజ్ తండ్రి షేక్ మస్తాన్ సాహేబ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఓ చోరీ కేసులో అరెస్టయిన అజీజ్ నెల రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. హత్యకేసుల్లోనూ నిందితుడు అరెస్టయిన నాగమల్లేశ్వరరావు చోరీ సొత్తును అతని బాబాయ్‌లు ఏలూరు తూర్పువీధికి చెందిన గొల్లపల్లి నాగరాజు, జంగారెడ్డిగూడెంకు చెందిన దాసరి బోసురాజు వద్ద దాచేవాడు. నాగ మల్లేశ్వరరావుపై విశాఖపట్నం జిల్లాలో రెండు హత్య కేసులు ఉన్నట్టు పోలీసులు చెప్పారు. ఫిర్యాదు సక్రమంగా ఇవ్వాలి ఎక్కడైనా చోరీ జరిగితే బాధితులు ఫిర్యాదులో పోయిన వస్తువులు, నగదు వివరాలు సక్రమంగా ఇవ్వాలని ఎస్పీ భాస్కర్‌భూషణ్ కోరారు. ఇటీవల రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఫిర్యాదుదారు తన ఇంట్లో రూ.10వేలు చోరీకి గురైతే రూ.3లక్షలు పోయినట్టు ఫిర్యాదు ఇచ్చారని, ఇలా చేయడం వల్ల విచారణ సరిగా సాగదని పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన భీమడోలు సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై బి.వెంకటేశ్వరరావు, రూరల్ ఎస్సై ఎం.వి.సుభాష్, హెడ్‌కానిస్టేబుళ్లు షేక్ అమీర్, బండారు నానిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్బీ డీఎస్పీ భాస్కరరావు, సీఐ చిన్ని కొండలరావు పాల్గొన్నారు. -
బాణసంచా అక్రమ తయారీపై కఠిన చర్యలు
ఏలూరు అర్బన్ : జిల్లాలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ హెచ్చరించారు. ఆయన శుక్రవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీపావళి పండుగను ప్రజలంతా సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. దీనికోసం పోలీసుశాఖ రక్షణ చర్యలు చేపట్టిందని వెల్లడించారు. అక్రమ బాణసంచా తయారీ కేంద్రాలపై పోలీసులకు ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫోన్‌కాల్స్‌ను స్వీకరించిన ఆయన ప్రజల సమస్యలను విన్నారు. బుట్టాయిగూడెం నుంచి ఫోన్ చేసిన ఓ వ్యక్తి గ్రామంలో పేకాట యథేచ్ఛగా సాగుతోందని, దానిని నిరోధించాలని కోరారు. ఏలూరులో ట్రాఫిక్ నియంత్రించాలని మరో వ్యక్తి విజ్ఞప్తి చేశారు. కైకరంలో ఒకవ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడని ఆ గ్రాముస్తడు ఫిర్యాదు చేశారు. దెందులూరులో ఆటోలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. మొత్తం 15 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. -
పోలీసుల పిల్లలు మరిన్ని విజయాలు సాధించాలి
ఏలూరు అర్బన్ : పోలీసుల పిల్లలు అన్ని రంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి, విజయాలను చూసి గర్వపడుతున్నానని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ అన్నారు. డాక్టర్ టి.వెంకటేశ్వరరావు, టి.ప్రభాకరరావులు తమ తండ్రి జ్ఞాపకార్థం స్థానిక సురేష్ బహుగుణ పోలీస్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో ప్రతిభ చూపిన వారికి ఏటా నగదు పురస్కారాలు అందజేస్తున్నారు. శుక్రవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు భాస్కర్‌భూషణ్ చేతులమీదుగా విద్యార్థులకు నగదు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల పిల్లలు మరింతగా శ్రమించి భవిష్యత్‌లో మరిన్ని విజయాలు నమోదు చేయాలని, పోలీస్ శాఖకు వన్నె తేవాలని ఆకాంక్షించారు. అందుకోసం అవసరమైన తోడ్పాటు అందించేందుకు తాను అన్ని విధాలా సహకరిస్తానని స్పష్టం చేశారు. పిల్లల విజయంలో తోడ్పాటు అందించిన పాఠశాల ఆధ్యాపకులు, తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్న పూర్వ విద్యార్థుల యోచన ఆదర్శనీయమన్నారు. ఆర్.కీర్తి (పదో తరగతి). కె.గణే ష్ (పదో∙తరగతి), కె.ఆంజనేయులు (ఇంటర్), ఎస్ఎల్సీ సాయికుమార్ (ఇంటర్)లకు రూ.10,000, జేవీ.శివకుమార్, బి.సౌజన్యలకు రూ.2,500 నగదు అందించారు. ఏఆర్ డీఎస్పీ బి.చంద్రశేఖర్, ఆర్ఐ ఎ.వెంకట్రావు పాల్గొన్నారు. -
నేరాల కట్టడికి సీసీ కెమెరాలు
పాలకోడేరు : జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నేరాల కట్టడికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, వీటిని జిల్లా కేంద్రం ఏలూరుకు అనుసంధానించి ఓ డీఎస్పీ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమిస్తామని ఎస్పీ భాస్కర్ భూషణ్ వెల్లడించారు. మంగళవారం ఆయన శృంగవృక్షం గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను, ఎన్టీఆర్ సుజల ఆర్వో ప్లాంటును ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని, చోరీలు, ఇతర నేరాలనూ అరికట్టవచ్చని వివరించారు. ఇప్పటికే కొవ్వూరు, ఉండి తదితర చోట్ల దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. రానున్న కాలంలో జిల్లా అంతటా విస్తరిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. శృంగవృక్షం గ్రామ సర్పంచ్ కలిదిండి దుర్గాదీప్తిని అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, డీఎస్పీ జి.పూర్ణచంద్రర రావు, భీమవరం రూరల్ సీఐ జయసూర్య, ఉండి ఏఎంసీ చైర్మన్ కొత్తపల్లి గోపాలకృష్ణంరాజు, ఎంపీపీ పాలా వెంకటచలపతి, సర్పంచ్ కలిదిండి దుర్గాదీప్తి, కలిదిండి కృష్ణంరాజు, సర్పంచ్ల ఛాంబర్ అధ్యక్షుడు గాదిరాజు సూర్యనారాయణరాజు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఆరేడులో.. ఉండి : ఉండి మండలం ఆరేడులో గణపవరం ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలనూ ఎమ్మెల్యే శివరామరాజుతో కలిసి ఎస్పీ ప్రారంభించారు. కార్యక్రమంలో మండల సర్పంచ్ల చాంబర్ అధ్యక్షుడు జుత్తిగ శ్రీనివాస్, ఎంపీపీ డలియా లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యులు కె సత్యతులసి, సర్పంచ్ పి.పోలేశ్వరరావు, వి.సుజాత తదితరులు పాల్గొన్నారు.