గరుడవాహనంపై మలయప్పస్వామి
–మలయప్ప దర్శనంతో భక్తకోటి తన్మయత్వం
– మాదిరి బ్రహ్మోత్సవాల తరహాలో వాహన ఊరేగింపు
సాక్షి,తిరుమల: తిరుమలలో శుక్రవారం గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా పురవీ«ధుల్లో మలయప్ప గరుడవాహనంపై దర్శనమివ్వటం ఆలయ సంప్రదాయం. సాయంసంధ్యాసమయం పూజలు ముగించుకుని శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప కొలువు మండపంలో వేంచేపు చేశారు. వేయి నేతిదీపాల వెలుగులో సహస్ర దీపాలంకారసేవలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తర్వాత వాహన మండపంలో వేంచేపు చేశారు. భక్తాగ్రేసుడైన గరుడుడిపై ఆశీనులైన మలయప్పను అర్చకులు విశేష ఆభరణాలు, సుగంధ సువాసనలు వెదజల్లే పుష్పాలతో అలంకరించారు. రాత్రి 7 గంటలకు భక్తుల గోవింద నామస్మరణలు, వేద మంత్రాల నడుమ ప్రారంభమైన ఊరేగింపు రాత్రి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధులో ్ల సాగింది. భక్తుల హారతి నడుమ స్వామివారు దర్శనమిస్తూ కనువిందు చేశారు. భక్తులు అశేష సంఖ్యలో హాజరై ఉత్సవర్లను దర్శించుకుని ఆనంద పరవశులయ్యారు.
మాదిరి బ్రహ్మోత్సవంలా వాహన ఊరేగింపు
అక్టోబరు 3 నుండి 11 వ తేది వరకు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన గరుడ వాహనాన్ని మాదిరి బ్రహ్మోత్సవం తరహాలో ఊరేగించారు. ఇందుకోసం భారీ పోలీసు బలగాలు, విజిలెన్స్ సిబ్బందిని బందోబస్తు నిర్వహించారు. వాహనాన్ని అటుఇటు తిప్పుతూ భక్తులందరూ ఉత్సవమూర్తిని దర్శించేలా టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు పర్యవేక్షించారు. ఉత్సవం అద్యంతం కోలాహలంగా సాగింది. నేటి నుండి తిరుమల శనివారాలు (పెరటాశి మాసం) కావటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.