పశ్చిమ డెల్టాకు 7 వేల క్యూసెక్కులు విడుదల
కొవ్వూరు : జిల్లాలో పశ్చిమ డెల్టా కాలువకి 7 వేల క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాల నిమిత్తం విడిచిపెడుతున్నారు. జిల్లాలో ఏలూరు కాలువకి 1,180 క్యూసెక్కులు, ఉండి కాలువకి 1,714, నరసాపురం కాలువకి 2,020, గోస్తనీ (జీఅండ్ వీ)కి1,035, అత్తిలి కాలువకి 578 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని మూడు డెల్టాలకు 13,800 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శుక్రవారం ఉదయం ఆరుగంటలకు గోదావరి నుంచి 3,57,496 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. సాయంత్రానికి కాస్త ఇన్‌ఫ్లో తగ్గడంతో ఆరుగంటల నుంచి 2,54,048 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆనకట్ట వద్ద శుక్రవారం సాయంత్రం నీటిమట్టం 10.20 అడుగులుగా నమోదైంది. ఆనకట్టకి ఉన్న 175 గేట్లును అరమీటరు ఎత్తు లేపి వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. భద్రచలంలో నీటిమట్టం 24 అడుగులకు తగ్గింది. దీంతో రానున్న రెండు రోజుల్లో వరద తీవ్రత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.