ఉద్యోగులు ప్రజలతో మమేకం కావాలి
ఏలూరు (మెట్రో) : ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న వ్యతిరేక భావం పోవాలంటే ఉద్యోగులు ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించాలని, వారితో కలిసి పనిచేయాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం ఏపీ ఎన్జీవోలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ కొందరు ఉద్యోగుల పట్ల ప్రజల్లో సరైన అభిప్రాయం లేదని పదిమందికీ మేలు చేసే కార్యక్రమాల్లో కొన్ని విషయాలు ఇబ్బంది అనిపించినా కష్టపడి పనిచేసి ప్రజలకు సేవ చేస్తే పరవాలేదన్నారు. వ్యక్తి కోసం చట్టాన్ని అతిక్రమించి ఎవరు పనిచేసినా సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా శాఖా పరంగా ఇబ్బందులు పడుతుంతే తన దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. జిల్లా ఎన్జీవో అధ్యక్షుడు ఆర్‌ఎస్ హరనాథ్ మాట్లాడుతూ అన్ని శాఖల ఉద్యోగులూ కష్టపడి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆర్.సూర్యారావు, ఎన్జీవో నాయకులు చోడగిరి శ్రీనివాస్, రమేష్‌కుమార్, శ్రీధర్, సత్యనారాయణ, ఐవీఎస్‌ఎన్ రాజు పాల్గొన్నారు.
న్యాయమూర్తి గోపి బాధ్యతల స్వీకరణ
ఏలూరు(సెంట్రల్) : జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా జి.గోపి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆయనను ఇటీవలే జిల్లా కోర్టు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీ చేశారు. దీంతో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.