పేదరిక నిర్మూలనకు ఉపాధి పథకాలు దోహదం
ఏలూరు (మెట్రో) : జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని, ఇచ్చిన ప్రతి రుణానికి యూనిట్ స్థాపన జరిగి తీరాల్సిందేనని కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. బ్యాంకర్లు, జిల్లా అధికారుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో పేదరిక నిర్మూలనకు ఉపాధి పథకాలు ఎంతో దోహదపడతాయన్నారు. తీసుకున్న రుణంతో యూనిట్లు స్థాపించకుండా ఉంటే బ్యాంకర్లపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో పేదవర్గాల జీవనస్థితిగతులు మెరుగుపరచడానికి పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయించడంలో నిరంతరం బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నానని, ఎక్కడా లేనివిధంగా జిల్లాలో పేదల జీవనస్థితిగతులు మెరుగుపరచడానికి అత్యధిక నిధులు కేటాయించేలా చేస్తున్నప్పటికీ చాలాచోట్ల తీసుకున్న రుణాలను పేదవర్గాలు సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడంలో బ్యాంకర్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో అదనపు జేసీ ఎంహెచ్.షరీఫ్, ఎల్‌డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు.