మూడో పంటకు ముందస్తు ప్రణాళిక
మూడో పంటకు ముందస్తు ప్రణాళిక
Published Thu, Dec 8 2016 12:03 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
ఏలూరు (మెట్రో): జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో మూడో పంటకు అవసరమైన ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని, మూడో పంట ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం వ్యవసాయం, ఉద్యాన, మార్కెటింగ్, పశుసంవర్ధకశాఖ ప్రాధాన్యతా రంగాల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో తొలిసారిగా మూడో పంటను ప్రోత్సహిస్తున్నామని రైతుల్లో పూర్తిస్థాయి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించేందుకు నాలుగు నెలల ముందే సన్నద్ధం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఈ పాస్ విధానం ద్వారా మాత్రమే ఎరువులు, పురుగు మందులు అమ్మకాలు చేయాలని ఏడు నెలలుగా చెబుతున్నా ఇంకా మాన్యువల్ అమ్మకాలు ఎందుకు జరుగుతున్నాయని కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 1వ తేదీ నుంచి జిల్లాలో పూర్తిస్థాయిలో ఈ పోస్ ద్వారానే ఫెర్టిలైజర్స్ అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, సీపీవో బాలకృష్ణ, వ్యవసాయ శాఖ జేడీ సాయిలక్ష్మీశ్వరి, ఉద్యానశాఖ ఏడీలు దుర్గేష్, విజయలక్ష్మి, ఎల్‌డీఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ నాగమల్లిక పాల్గొన్నారు.
ఆర్ అండ్ బీ పనులు వేగిరపర్చాలి
జిల్లాలోని డెల్టా ప్రాంతంలో మార్చి 21వ తేదీ నాటికి ఆర్ అండ్ బీ పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆర్ అండ్ బీ పనులపై ఆయన సమీక్షించారు. మార్చి 28 నుంచి మే 30 వరకు డెల్టా ఆధునికీకరణ పనుల నిమిత్తం కాలువల ద్వారా నీటి విడుదల ఆపేస్తామని చెప్పారు. జిల్లాలో ఆర్‌అండ్‌బి శాఖ ద్వారా రు.351 కోట్లతో 81 పనులను చేపట్టారని దానిలో రూ.121 కోట్లతో 31 పనులు పూర్తిచేయగా, 27 పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఆర్ అండ్ బీ ఎస్‌ఈ నిర్మల చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ పదేపదే సమావేశాలు నిర్వహించినా పనులు మాత్రం జాప్యం చేస్తున్నారన్నారు. ఏలూరు, నరసాపురం, కొవ్వూరు డివిజన్ల ఆర్ అండ్ బీ సిబ్బంది పాల్గొన్నారు.
చేపల వేటకు వెళ్లొద్దు
జిల్లాలో రాబోయే వారం రోజుల్లో తుపాను సంభవించే అవకాశమున్న దృష్టా‍్య తీర ప్రాంత ప్రజలు చేపల వేటకు వెళ్లవద్దని కలెక్టర్ భాస్కర్ ప్రకటనలో కోరారు. తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు, అవసరమైన సమచారాన్ని అందించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. వివరాలకు 08812–230050 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం పొందాలని సూచించారు.
విరాళాలకు పన్ను లేదు
సైనిక సంక్షేమ నిధికి విరాళాలు ఇచ్చేవారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉందని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా ఎన్‌సీసీ విద్యార్థులు బుధవారం నగరంలోని సైనిక సంక్షేమ నిధికి విరాళాలు సేకరించారు. విరాళాలు అందించే దాతలు సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్, విజయవాడ బ్రాంచ్ ఖాతా నెంబర్ 33881128795లో జమచేయాలని సూచించారు.
Advertisement