‘పోలవరం’ నిర్వాసితులకు వృత్తి నైపుణ్య శిక్షణ
Published Sat, Aug 6 2016 11:55 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
ఏలూరు (మెట్రో) : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు పది వృత్తుల్లో నాణ్యమైన శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రెండు శిక్షణ శిబిరాలను త్వరలో ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రగతి తీరుపై కలెక్టర్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిరాశ్రయులయ్యే 514 గిరిజనేతర కుటుంబాలకు జంగారెడ్డిగూడెం సమీపంలో కాలనీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వారంతా వివిధ వృత్తుల్లో నైపుణ్యం సాధించేందుకు అనువుగా జంగారెడ్డిగూడెం ఐటీఐ కేంద్రంలో, కెఆర్ పురంలో ప్రత్యేక శిక్షణ కోర్సులు అందిస్తున్నామన్నారు.
విస్తరణ కాకుండానే రూ.200 కోట్ల పన్ను వసూలా?
జిల్లాలో ఆరు లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టకుండానే ప్రజల నుంచి టోల్‌గేట్ పన్ను నాలుగేళ్లలో రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేశారని, ఈ సొమ్మును రికవరీ చేసి జిల్లా అభివృద్ధికి ఖర్చు చేసేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ చెప్పారు. రానున్న సీజన్ నాటికి ఎర్రకాలువ పనులు పూర్తి కావాలని, తమ్మిలేరు అభివృద్ధికి ఒక ప్రణాళిక ప్రభుత్వానికి అందించామని తెలిపారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి డిజైన్లను ఆమోదించడంలో ఇరిగేషన్ శాఖ సీడీవో గిరిధర్‌రెడ్డి ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. వారం రోజల్లో డిజైన్లకు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. భీమవరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా బైపాస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన సర్వే ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను భాస్కర్ ఆదేశించారు.
Advertisement