వీసీలో మట్లాడుతున్న కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రవినాయక్
మహబూబ్‌నగర్: జిల్లాలోని ఓటర్లకు బుధవారం నుంచి ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.రవినాయక్ ఆదేశించారు. ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, వెబ్ కాస్టింగ్ తదితర అంశాలపై మంగళవారం ఆయన ఐడీఓసీ నుంచి సెక్టోరల్ అధికారులు, ఏఆర్వోలు, బీఎల్వోలు తదితరులతో వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ నిర్వహించే ఐదు రోజుల ముందే అంటే 25వ తేదీలోగా ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీని పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. సెక్టోరల్ అధికారులు ప్రతిరోజు ఏ ప్రాంతంలో ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేస్తున్నది ముందుగానే షెడ్యూల్‌లో పేర్కొనాలని, సదరు షెడ్యూల్‌ను రాజకీయ పార్టీలకు తెలియజేయాలని, బీఎల్‌ఓలతో పాటు, బీఎల్‌ఏలకు ఈ విషయం చెప్పాలన్నారు.
ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీపై తక్షణమే బీఎల్వోలు, సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించాలని, అదేవిధంగా సెక్టోరల్ అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, ఏ రోజుకు ఆ రోజు ఎన్ని స్లిప్పులు పంపిణీ చేసింది నివేదిక సమర్పించాలన్నారు. ఓటరు సమాచార స్లిప్పులను, ఓటరు గైడ్, సీ–విజిల్ పోస్టర్లను తక్షణమే సేకరించుకోవాలని ఆదేశించారు. ఒకసారి ఓటరు ఇంటికి వెళ్లినప్పుడు ఓటరు లేనట్లయితే మరోసారి వెళ్లాలని సూచించారు.
ఓటరు సమాచార స్లిప్పులు కేవలం బీఎల్‌ఓలు మాత్రమే పంపిణీ చేయాలని, ఎట్టి పరిస్థితులలో ఇతరులు పంపిణీ చేయకూడదని, ఇంట్లో ఓటరు లేనట్లయితే పెద్ద వారికి మాత్రమే ఇచ్చి సంతకం తీసుకోవాలన్నారు. ఓటరు సమాచార స్లిప్పులు బీఎల్‌ఓ దగ్గర కాకుండా ఇతరుల వద్ద కనబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ వ్యవస్థ సక్రమంగా నిర్వహించేందుకు సెక్టోరల్ అధికారులు సరాసరిన తనిఖీ చేయాలన్నారు.
రిటర్నింగ్ అధికారులు ఓటరు సమాచార స్లిప్పులపై హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయాలని, ఫోన్ నంబర్ ఏర్పాటు చేసి ఓటరు సమాచార స్లిప్పులపై వచ్చే ఫిర్యాదు ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
వెబ్‌కాస్టింగ్‌పై కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమైన, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ నిర్వహించాలని, ఇందుకు తక్షణమే ఏఆర్వోలు పోలింగ్‌కేంద్రాల లేఔట్లను రూపొందించి పంపించాలని ఆదేశించారు.
కేంద్రాలలో కరెంటు సరఫరా, త్రీ పిన్ ఫ్లగ్ వంటివి ఉన్నాయో లేదో చూడాలని, ఏజెన్సీ వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేసే సమయంలో పూర్తిగా సహకరించి లే ఔట్ ప్రకారం కెమెరా ఎక్కడ ఏర్పాటు చేయాలో తెలియజేయాలని ఆదేశించారు.
ఆబ్సెంట్ ఓటర్లను సమీక్షిస్తూ ఫామ్–12–డీ ప్రకారం ఏ పోలింగ్ కేంద్రంలో ఎంతమంది హోం ఓటర్లు ఉన్నారో చూసుకుని అందుకు తగ్గట్టుగా రూట్ మ్యాప్ తయారు చేయాలని, ఎంత మంది పోలింగ్ సిబ్బంది అవసరం ఉంటుందో ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment