ఆలయంలోని కొప్పెరలో కానుకలు సమర్పించేందుకు క్యూ కట్టిన భక్తులు
సాక్షి, తిరుమల:తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు కానుకలు సమర్పించేందుకు శుక్రవారం రెండో కొప్పెర(హుండీ) ఏర్పాటు చేశారు. పౌర్ణమి పర్వదినంలోని శుభ గడియాల్లో ఈ కొత్త కొప్పెర ప్రారంభించారు. ఆలయ సన్నిధిలో జయ–విజయలకు పక్కనే ఈశాన్యదిశలో నాటికాలం నుండి కొప్పెర ఉంది. ఇందులోనే భక్తులు కానుకలు సమర్పిస్తుంటారు. ఇలా ఏటా రూ.1000 కోట్లు నగదు కానుకలు, రూ.300 కోట్ల విలువైన బంగారం, వెండి, ఇతర విలువైన రంగురాళ్లు లభిస్తున్నాయి. హుండీలో కానుకలు సమర్పించేందుకు భక్తుల రద్దీ పెరిగింది. వారి మధ్యతోపులాటలు జరుగుతున్నాయి. మరికొన్ని సార్లు హుండీ కానుకలు కూడా చోరీకి గురవుతున్నాయి. దీన్ని గుర్తించిన టీటీడీ ఈవో సాంబశివరావు కొత్త హుండీ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. దీనికి ఆగమ పండితులు, అర్చకులు పచ్చజెండా ఊపారు. దీంతో ప్రస్తుతం ఉన్న హుండీకి సమీపంలోనే మరో హుండీ ఏర్పాటు చేశారు. ఆగమ శాస్రంతోపాటు సౌకర్యవంతంగా ఏర్పాటు చేయటంతో భక్తులు కూడా సులభంగా కానుకలు, ముడుపులు సమర్పిస్తున్నారు.