క్యాంప్‌ను ప్రారంభిస్తున్న సత్యనారాయణ
దేశాభివృద్ధిలో సైన్స్ పాత్ర కీలకం
Published Fri, Aug 12 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
– తిరుపతి ఐఐటీ ఇన్‌చార్జి సత్యనారాయణ
యూనివర్సిటీక్యాంపస్: దేశాభివృద్ధిలో సైన్స్ పాత్ర కీలకమని తిరుపతి ఐఐటీ ఇన్‌చార్జి సత్యనారాయణ పేర్కొన్నారు. ఎస్వీ యూనివర్సిటీలో శుక్రవారం ఇన్‌స్పైర్ సైన్స్‌క్యాంప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్, చైనాలు అతి పెద్ద జనాభా కలిగివుండడంతో పాటు శాస్త్రీయ నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటున్నాయన్నారు. భారతదేశానికి సవాల్‌గా మారిన జనాభా పెరుగుదల నేడు వరంగా మారిందని చెప్పారు. మనదేశంలో అత్యధికంగా యువత వుందని, ఈ మానవ వనరులకు సరైన నైపుణ్యాలు కల్పిస్తే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. పరిశోధన రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలంటే సైన్స్‌పరిశోధన పట్ల ఆసక్తి ప్రదర్శించాలని చెప్పారు. నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ వీరయ్య మాట్లాడుతూ ఇంటర్ తర్వాత విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్, లా, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులపై దృష్టి పెడుతున్నారన్నారు. ఇన్‌స్పైర్ క్యాంప్ ద్వారా యువతకు పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. చాలా మంది శాస్త్రవేత్తలు 19–22 ఏళ్ల మధ్య అనేక ఆవిష్కరణలు చేశారని చెప్పారు. ఎస్వీయూ రెక్టార్ ఎం.భాస్కర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా డీఎస్‌టీ ద్వారా 5 వేల మంది విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారన్నారు. సైన్స్ అభివృద్ధితోనే ఏదేశమైనా సంస్థ అయినా అభివృద్ధి సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ దేవరాజులు, ఇన్‌స్పైర్ క్యాంప్ కోఆర్డినేటర్ దేవప్రసాద్‌రాజు, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.అబ్బయ్య పాల్గొన్నారు.
Advertisement