రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన జైలర్ సినిమాకు ఏ రేంజ్‌లో స్పందన లభించిందో తెలిసిందే! ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రెండు, మూడు రోజుల్లో ఓటీటీలో ప్రత్యక్షం కానుంది. తలైవా సినిమాను మరోసారి ఓటీటీలో చూసేందుకు తెగ ఎదురుచూస్తున్నారు అభిమానులు.
రజనీకి గవర్నర్ పదవి?
ఇదిలా ఉంటే రజనీకాంత్ గవర్నర్ కాబోతున్నారంటూ కొంతకాలంగా తమిళనాట ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారంపై రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ స్పందించాడు. రజనీకి గవర్నర్ పదవి భగవంతుడి చేతుల్లో ఉందన్నారు. ఆదివారం నాడు మధురైలో మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సత్యానారాయణ మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల్లోకి రారు, కానీ..
రజనీకాంత్ రాజకీయాల్లో చేరబోరని స్పష్టం చేశారు. రాజకీయ రంగప్రవేశం గురించి తను ఆలోచించడం లేదన్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో రజనీ భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని తెలిపారు. రజనీకి గవర్నర్ పోస్ట్ రాబోతుందా? అన్న ప్రశ్నకు అంతా దేవుడి చేతుల్లో ఉందని పేర్కొన్నారు. గవర్నర్ పదవి రావాలని ఎలాంటి ఆశలు పెట్టుకోలేదని, ఒకవేళ వస్తే మాత్రం సంతోషిస్తామన్నారు. గవర్నర్ పదవి ఆఫర్ చేస్తే రజనీ తప్పకుండా దాన్ని స్వీకరిస్తాడని తెలిపారు.
రాజకీయ నేతలతో భేటీ
కాగా ఇటీవల రజనీకాంత్ ఉత్తర భారతేదశంలో పర్యటించాడు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ అవడంతో ఈ గవర్నర్ అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంపై రజనీ సోదరుడు సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రచారానికి మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment