7న గోదావరికి మహా నీరాజనం
7న గోదావరికి మహా నీరాజనం
Published Fri, Oct 28 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
కొవ్వూరు :తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 7న గోదావరికి మహా నీరాజనం కనుల పండువగా నిర్వహించనున్నట్టు ఆర్డీవో బి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గోష్పాదక్షేత్రం స్నానఘట్టానికి ప్రతి కార్తీక సోమవారం భక్తుల రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరికి మహా నీరాజనం సమర్పించేందుకు స్నానఘట్టం వద్ద నదిలో మూడు పంట్లు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన వేదికను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. టీటీడీ నుంచి తెచ్చిన భూదేవి, శ్రీ దేవి సమేత కలియుగ వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. గోదావరిలో పెరిగిన ఒండ్రు మట్టి, చెత్త చెదారం తొలగింపునకు కలెక్టర్ రూ.లక్ష మంజూరు చేసినట్టు చెప్పారు. పారిశుధ్యం మెరుగ్గా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్‌కి సూచించారు. భక్తులకు తాగునీరు, రక్షణ తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Advertisement
Advertisement