వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ మూర్తులకు క్షీరాభిషేకం
–కన్నుల పండుగగా శతకలశ క్షీరాభిషేకం
–సిద్ధి బుద్ది సమేత దేవేరులను వీక్షించేందుకు పోటెత్తిన భక్తులు
కాణిపాకం(ఐరాల):
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి అత్యంత వైభవంగా చిన్న పెద్ద శేషవాహన సేవలు నిర్వహించారు. ఈక్రమంలో ఉదయం స్వామి వారి ఉత్సవ మూర్తులకు నేత్ర పర్వంగా అష్టోత్తర శతకలశ పంచామృతాది అభిషేకాలు జరిపారు. ఉత్సవ ఉభయదారులు అభిషేకాన్ని శాస్త్రోక్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం అష్టోత్తర శత కలశాలను మణికంఠేశ్వర స్వామి ఆలయం నుంచి కాణిపాకం పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులను అలంకార మండపంలోని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి పాలు, నెయ్యి, తేనె, పెరుగు, విభూది, సుగంధ ద్రవ్యాలతో ఆశేష భక్తజనం వీక్షిస్తుండగా సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను అలంకరించి వేదమంత్రోచ్ఛారణల నడుమ దూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులందరికీ ఈఓ పూర్ణచంద్రారావు, ఆలయ సిబ్బంది స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో మహిళలు పెద్దెత్తున పాల్గొన్నారు.ఆలయ ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్‌లు, ఉత్సవకమిటీసభ్యులు, ఉభయ దారులు పాల్గొన్నారు.