seshavahanam
-
శేష వాహనంపై ఖాద్రీశుడు
కదిరి : ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి మంగళవారం తన జయంతిని పురస్కరించుకొని తిరువీధుల్లో శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్త ప్రహ్లాదుడి కోరిక మేరకు స్తంభం నుంచి ఆవిర్భవించిన రోజును స్వామివారి జయంతిగా జరుపుకుంటామని ఆలయ అర్చకులు తెలియజేశారు. పాలసంద్రంపై శేష తల్పమున పవళించిన శ్రీమహా విష్ణువుకు ఇది ప్రీతిపాత్రమైన అంశమని, లక్ష్మీ నారసింహుని జయంతి సందర్భంగా శ్రీవారికి సేవ చేయడానికి సాక్షాత్తు ఆదిశేషుడే వాహనంగా విచ్చేస్తారని అర్చకులు వివరించారు. బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, పట్టు పీతాంబరాలతో విశేషాలంకరణలో ఉన్న ఖాద్రీశుడు శేషవాహనంపై కొలువుదీరి తిరువీధుల్లో ఊరేగారు. భక్తులు నరసింహ మంగళహారతి మంత్రాన్ని జపిస్తే పాప విముక్తి కల్గుతుందని తెలిపారు. ఉభయదారులుగా కర్ణాటక రాష్ట్రం దేవనహళ్లికి చెందిన మునిరాజు కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు, ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డిలు తెలియజేశారు. -
శేషవాహనంపై శ్రీరంగనాథుడు
తర్తూరు (జూపాడుబంగ్లా): తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం శేషవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ఉత్సవ విగ్రహానికి పన్నీటితో స్నానం చేయించి పట్టువస్త్రాలతో ముస్తాబుచేశారు. వేదమంత్రాల మధ్య స్వామి, అమ్మవార్లను మల్లెపూలతో అలంకరించి అనంతరం పల్లకిలో ఉంచి ఊరేగింపుగా శేషవాహనం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం భక్తుల జయజయ ధ్వానాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శేషవాహనోత్సవానికి విశిష్టత ఉంది. ఈ రోజు స్వామివారికి మల్లెలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటే తమకు సర్పగండం ఉందని భక్తుల నమ్మకం. దీంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మల్లెపూలలను సమర్పించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో భక్తులు సమర్పించి మల్లెలతో స్వామివారి, అమ్మవారి మూల విగ్రçహాలు నిండిపోయాయి. ఆదివారం హనుమద్వాహనసేవ నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు వెంకటరెడ్డి, ఈఓ సుబ్రమణ్యంనాయుడు, చైర్మన్ రాయపురంగారెడ్డి తెలిపారు. -
శేష వాహనంపై జంబుకేశ్వరుడు
రాయదుర్గం టౌన్ : పట్టణంలోని కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రాత్రి స్వామి వారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. స్వామివారి శేషవాహనాన్ని కోట, వినాయక సర్కిల్ మీదుగా నేసేపేట వరకు ఊరేగించారు. అక్కడి నుంచి తిరిగి స్వామి వారి వాహనం ఆలయానికి చేరుకుంది. శనివారం స్వామి కైలాస వాహనోత్సవం, ఆదివారం కల్యాణోత్సవం ఉంటుందని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు తెలిపారు. -
కమనీయం.. శేషవాహనం
-
వరసిద్దునికి అష్టోత్తర అభిషేకం
–కన్నుల పండుగగా శతకలశ క్షీరాభిషేకం –సిద్ధి బుద్ది సమేత దేవేరులను వీక్షించేందుకు పోటెత్తిన భక్తులు కాణిపాకం(ఐరాల): కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి అత్యంత వైభవంగా చిన్న పెద్ద శేషవాహన సేవలు నిర్వహించారు. ఈక్రమంలో ఉదయం స్వామి వారి ఉత్సవ మూర్తులకు నేత్ర పర్వంగా అష్టోత్తర శతకలశ పంచామృతాది అభిషేకాలు జరిపారు. ఉత్సవ ఉభయదారులు అభిషేకాన్ని శాస్త్రోక్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం అష్టోత్తర శత కలశాలను మణికంఠేశ్వర స్వామి ఆలయం నుంచి కాణిపాకం పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులను అలంకార మండపంలోని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి పాలు, నెయ్యి, తేనె, పెరుగు, విభూది, సుగంధ ద్రవ్యాలతో ఆశేష భక్తజనం వీక్షిస్తుండగా సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను అలంకరించి వేదమంత్రోచ్ఛారణల నడుమ దూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులందరికీ ఈఓ పూర్ణచంద్రారావు, ఆలయ సిబ్బంది స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో మహిళలు పెద్దెత్తున పాల్గొన్నారు.ఆలయ ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్లు, ఉత్సవకమిటీసభ్యులు, ఉభయ దారులు పాల్గొన్నారు.