శేష వాహనంపై ఖాద్రీశుడు
కదిరి : ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి మంగళవారం తన జయంతిని పురస్కరించుకొని తిరువీధుల్లో శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్త ప్రహ్లాదుడి కోరిక మేరకు స్తంభం నుంచి ఆవిర్భవించిన రోజును స్వామివారి జయంతిగా జరుపుకుంటామని ఆలయ అర్చకులు తెలియజేశారు. పాలసంద్రంపై శేష తల్పమున పవళించిన శ్రీమహా విష్ణువుకు ఇది ప్రీతిపాత్రమైన అంశమని, లక్ష్మీ నారసింహుని జయంతి సందర్భంగా శ్రీవారికి సేవ చేయడానికి సాక్షాత్తు ఆదిశేషుడే వాహనంగా విచ్చేస్తారని అర్చకులు వివరించారు. బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, పట్టు పీతాంబరాలతో విశేషాలంకరణలో ఉన్న ఖాద్రీశుడు శేషవాహనంపై కొలువుదీరి తిరువీధుల్లో ఊరేగారు. భక్తులు నరసింహ మంగళహారతి మంత్రాన్ని జపిస్తే పాప విముక్తి కల్గుతుందని తెలిపారు. ఉభయదారులుగా కర్ణాటక రాష్ట్రం దేవనహళ్లికి చెందిన మునిరాజు కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు, ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డిలు తెలియజేశారు.