khadrisudu
-
శేష వాహనంపై ఖాద్రీశుడు
కదిరి : ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి మంగళవారం తన జయంతిని పురస్కరించుకొని తిరువీధుల్లో శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్త ప్రహ్లాదుడి కోరిక మేరకు స్తంభం నుంచి ఆవిర్భవించిన రోజును స్వామివారి జయంతిగా జరుపుకుంటామని ఆలయ అర్చకులు తెలియజేశారు. పాలసంద్రంపై శేష తల్పమున పవళించిన శ్రీమహా విష్ణువుకు ఇది ప్రీతిపాత్రమైన అంశమని, లక్ష్మీ నారసింహుని జయంతి సందర్భంగా శ్రీవారికి సేవ చేయడానికి సాక్షాత్తు ఆదిశేషుడే వాహనంగా విచ్చేస్తారని అర్చకులు వివరించారు. బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, పట్టు పీతాంబరాలతో విశేషాలంకరణలో ఉన్న ఖాద్రీశుడు శేషవాహనంపై కొలువుదీరి తిరువీధుల్లో ఊరేగారు. భక్తులు నరసింహ మంగళహారతి మంత్రాన్ని జపిస్తే పాప విముక్తి కల్గుతుందని తెలిపారు. ఉభయదారులుగా కర్ణాటక రాష్ట్రం దేవనహళ్లికి చెందిన మునిరాజు కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు, ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డిలు తెలియజేశారు. -
నేడు ఐరావతంపై ఊరేగనున్న ఖాద్రీశుడు
కదిరి : ఖాద్రీ లక్ష్మీ నారసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు ఐరావతం(గజవాహనం)పై భక్తులకు శుక్రవారం దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాల్లో జరిగే ప్రతి ఉత్సవంలో స్వామివారు తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చి, తిరిగి ఆలయంలోకి వెళ్తారు. అయితే ఐరావతంపై తిరువీధుల్లో దర్శనమిచ్చిన అనంతరం శ్రీవారు నేరుగా బ్రహ్మ రథోత్సవంపైకి చేరుకుంటారు. హిరణ్యకస్యపుడిని సంహరించిన నారసింహుడి ఉగ్రరూపాన్ని చూడలేని దేవతాగణం స్వామివారిని ప్రసన్నం కావాలని కోరగా అందుకు అనుగ్రహించిన నారసింహుడు ఐరావతంపై దర్శనమిస్తారు. ఈ ఉత్సవం ముగిసిన మరుసటిదినమే లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్న నృసింహుడి బ్రహ్మ రథోత్సవం. ఇప్పటికే భక్తులు శ్రీవారి రథోత్సవం ఆలయానికి చేరుకోవడంతో ఆ ప్రాంగణమంతా కాలుమోపేందుకు కూడా చోటు లేనంతగా భక్తులతో కిక్కిరిసిపోతోంది. గజవాహనోత్సవానికి ఉభయదారులుగా పబ్బిశెట్టి కుటుంబీకులు వ్యవహరిస్తారిని ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి, పాలక మండలి చైర్మన్ నరేంద్రబాబు తెలిపారు. -
శేషవాహనంపై లక్ష్మీ నారసింహుడు
కదిరి : బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు సోమవారం రాత్రి శేష వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఉత్సవంలో నారసింహుడు మాత్రమే తిరు వీధుల్లో విహరించేవారు. అయితే.. శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమివ్వడం ఈ ఉత్సవ ప్రత్యేకత. పాలసంద్రంపై శేష తల్పమున పవళించిన శ్రీమహా విష్ణువుకు ఇది ప్రీతి పాత్రమైన అంశం. లక్ష్మీ నారసింహునికి సేవ చేయడానికి సాక్షాత్తూ ఆదిశేషుడే వాహనంగా విచ్చేశారని ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, పట్టు పీతాంబరాలతో విశేషాలంకరణలో ఉన్న ఖాద్రీశుడు రాత్రి తొమ్మిది గంటలకు శేషవాహనంపై కొలువుదీరారు. ఆలయం ముందు విద్యుద్దీపాలంకరణ పూర్తి కాగానే తిరువీధుల్లో ఊరేగారు. స్వామివారి దివ్య మంగళరూపాన్ని భక్తులు దర్శించుకుని తన్మయత్వం చెందారు. యాగశాల ప్రవేశం, నిత్య హోమం నిర్వహించి స్వామి వారిని సుగంధ ద్రవ్యాలతో అలంకరించారు. ఆచార్య రుత్వికులను ఆలయ మర్యాదలతో అర్చకులు ఆహ్వానించారు. శేష వాహనంపై ఉన్న స్వామి వారిని దర్శించుకుంటే నాగదోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. శేష వాహనోత్సవం ఉభయదారులుగా యాదాలం శ్రీనివాసులు, బాలాజీ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు, ఈఓ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. -
నేడు సింహ వాహనంపై ఊరేగింపు
కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం కదిరి తిరువీధుల్లో సింహవాహనంపై తన భక్తులకు దర్శనభాగ్యం కల్గిస్తారు. మనుషుల్లో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని లోకానికి చాటి చెప్పడానికే స్వామివారు సింహవాహనంపై ఊరేగుతారని భక్తుల నమ్మకం. యాగశాల ప్రవేశం, నిత్యహోమాలతో ప్రారంభమై శ్రీవారి తిరువీధుల మండపోత్సవం నిర్వహిస్తారు. యాగశాలలో ఉదయం పుణ్యాహవచనం జరిపి వాస్తు, అగ్ని ప్రతిష్ట చేస్తారు. రాత్రివేళ స్వామివారు తిరువీధుల్లో విహరిస్తారు. ఉభయదారులుగా బెంగళూరుకు చెందిన నిరంజన్, కదిరి పట్టణానికి చెందిన లక్ష్మీదేవమ్మ, రుక్మిణమ్మ, మాడిశెట్టి నరసయ్య కుటుంబీకులు వ్యవహరిస్తారని ఆలయ కమిటీ చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి తెలియజేశారు.