శేషవాహనంపై లక్ష్మీ నారసింహుడు
కదిరి : బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు సోమవారం రాత్రి శేష వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఉత్సవంలో నారసింహుడు మాత్రమే తిరు వీధుల్లో విహరించేవారు. అయితే.. శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమివ్వడం ఈ ఉత్సవ ప్రత్యేకత. పాలసంద్రంపై శేష తల్పమున పవళించిన శ్రీమహా విష్ణువుకు ఇది ప్రీతి పాత్రమైన అంశం. లక్ష్మీ నారసింహునికి సేవ చేయడానికి సాక్షాత్తూ ఆదిశేషుడే వాహనంగా విచ్చేశారని ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, పట్టు పీతాంబరాలతో విశేషాలంకరణలో ఉన్న ఖాద్రీశుడు రాత్రి తొమ్మిది గంటలకు శేషవాహనంపై కొలువుదీరారు. ఆలయం ముందు విద్యుద్దీపాలంకరణ పూర్తి కాగానే తిరువీధుల్లో ఊరేగారు. స్వామివారి దివ్య మంగళరూపాన్ని భక్తులు దర్శించుకుని తన్మయత్వం చెందారు. యాగశాల ప్రవేశం, నిత్య హోమం నిర్వహించి స్వామి వారిని సుగంధ ద్రవ్యాలతో అలంకరించారు. ఆచార్య రుత్వికులను ఆలయ మర్యాదలతో అర్చకులు ఆహ్వానించారు. శేష వాహనంపై ఉన్న స్వామి వారిని దర్శించుకుంటే నాగదోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. శేష వాహనోత్సవం ఉభయదారులుగా యాదాలం శ్రీనివాసులు, బాలాజీ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు, ఈఓ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.