sheriffs
-
ఉయ్యాలోత్సవంలో లక్ష్మీనారసింహుడు
కదిరి : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు రంగ మండపంలో ఉయ్యాలోత్సవంలో తన భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అర్చకులు హేవిళంబి నామ నూతన సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది ఎండలు మండిపోతాయని, రైతులు నకిలీ విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోతారని తెలియజేశారు. పిడుగుపాటు వలన జన నష్టం, అకాల వర్షంతో పంట నష్టం సంభవిస్తుందని తెలిపారు. బియ్యం, చక్కెర, గోధుమల ధరలు మండిపోతాయన్నారు. విద్యాలయాల్లో గురువులే పిల్లలపై కాటేసే ప్రమాదముందన్నారు. విద్యాలయాలన్నీ వ్యాపార కేంద్రాలుగా దర్శనమిస్తాయని పేర్కొన్నారు. తెలుగు చలనచిత్ర సీమలో చిన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. సెల్ఫోన్ల పిచ్చి పెరిగి పోయి సెల్ఫీలే కొంప ముంచుతాయన్నారు. ప్రేమ పెళ్లిళ్లు, ఆత్మహత్యలు, అనుమానాస్పద మృతుల సంఖ్య బాగా పెరుగుతుందని తెలిపారు. సాఫ్ట్వేర్ రంగానికి గడ్డుకాలమేనని తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మెన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, ఆలయ కమిటీ సభ్యులు చంద్రశేఖర్, రఘునాథరెడ్డి, నాగరాజు, బీజేపీ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, ఇంకా పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. -
నేడు పుష్పయాగోత్సవం
నేటితో ముగియనున్న నృసింహుడి బ్రహ్మోత్సవాలు ఖాద్రీ లక్ష్మీ నృసింహుడి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగియనుండడంతో శ్రీవారి ఆలయ ప్రాంగణంలో పుష్పయాగోత్సవం నిర్వహించనున్నారు. ఆలయంలోని కళ్యాణ మండపంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభుడు భక్తులను ఆశీర్వదిస్తారు. బ్రహ్మోత్సవాలకు నలుదిక్కుల నుంచి విచ్చేసిన ఇంద్రాది అష్ట దిక్పాలకులు, ముక్కోటి దేవతలకు కృతజ్ఞతలతో చందన పుష్ప తాంబూలాలు సమర్పించి, వారిని వారి వారి లోకాలకు సాగనంపుతారు. తొలుత నవ కలశ ప్రతిష్ట, వాస్తు హోమాలు జరిపి, ఆలయ మహా సంప్రోక్షణ గావిస్తారు. శ్రీవారికి నిత్యకైంకర్యములు పూర్తిచేసి, తర్వాత విశేష పూల అలంకరణ, మంగళ హారతులు ఇచ్చి, పుష్పయాగోత్సవం ముగిస్తారు. ఉభయదారులుగా రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పూల అశ్వర్థనారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తారని ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి, చైర్మన్ నరేంద్రబాబు తెలిపారు. -
కనుల పండువగా శ్రీవారి చక్రస్నానం
పోటెత్తిన భక్త జనం ధ్వజావరోహణం తర్వాత నృసింహాలయం మూసివేత నేటి నుంచి యథావిధి దర్శనం శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీవారి చక్రస్నానం (తీర్థవాది ఉత్సవం) కనుల పండువగా, కోలాహలంగా జరిగింది. యాగశాల నుంచి శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామి వారు విచ్చేసి ఆలయ ప్రాంగణంలో కాసేపు కొలువు దీరారు. అక్కడ వసంతోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు దంపతులు, ఈఓ వెంకటేశ్వరరెడ్డి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులతో పాటు ఆలయ సిబ్బంది, బందోబస్తులో ఉన్న పోలీసులతో పాటు భక్తులంతా ఆనందోత్సాహాలతో వసంతాలు(రంగులు) చల్లుకున్నారు. అనంతరం శ్రీవారు శ్రీదేవి, భూదేవితో కలిసి తిరువీధుల గుండా దర్శనమిస్తూ భృగుతీర్థం చేరుకున్నారు. అక్కడ భక్తుల గోవింద నామస్మరణ మధ్య శ్రీవారు చక్రస్నానం ఆచరించారు. అనంతరం భక్తులందరూ కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. అక్కడి నుంచి ఖాద్రీ«శుడు కోనేరు వెలుపలకొచ్చి అక్కడ విశేషాలంకరణ అనంతరం తిరువీధుల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్గిస్తూ తిరిగి ఆలయ ప్రాంగణం చేరుకున్నారు. ధ్వజావరోహణం బ్రహ్మోత్సవాలకు సకల దేవతా మూర్తులను ఆహ్వానించేందుకు అర్చకులు ఆలయం ముందు ప్రారంభం నాడు ధ్వజారోహణం చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు కొత్త వస్త్రాన్ని తెచ్చి శ్రీవారి వాహనమైన గరుడి బొమ్మను చిత్రీకరించారు. దాన్ని గరుడ ధ్వజ పటం అంటారు. కొడితాడు సాయంతో దాన్ని ధ్వజస్తంభం మీద కట్టి పైకి ఎగుర వేశారు. పక్షం రోజుల పాటు గాలిలో ఎగిరిన ఈ గరుడ పతాకమే సకల దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రం. ఈ ఆహ్వానాన్ని అందుకొనే ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసి కదిరి కొండపై నుంచి తిలకిస్తారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. «ధ్వజపటాన్ని శ్రీవారి చక్రస్నానం అనంతరం «అవరోహణం గావించారు. దీంతో ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలికినట్లైందని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. ఆలయం మూసివేత కల్యాణోత్సవం నాటి నుంచి తీర్థవాది వరకూ స్వామి వారు యాగశాలలోనే గడిపారు. తీర్థవాది ముగించుకొని తిరిగి ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం నుంచి రోజంతా ఆలయం తలుపులు మూసేశారు. తిరిగి మంగళవారం ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు. ఎప్పటిలాగానే శ్రీవారు ఆలయంలో యథాప్రకారం పూజలందుకొని భక్తులకు దర్శనమిస్తారు. -
శేషవాహనంపై లక్ష్మీ నారసింహుడు
కదిరి : బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు సోమవారం రాత్రి శేష వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఉత్సవంలో నారసింహుడు మాత్రమే తిరు వీధుల్లో విహరించేవారు. అయితే.. శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమివ్వడం ఈ ఉత్సవ ప్రత్యేకత. పాలసంద్రంపై శేష తల్పమున పవళించిన శ్రీమహా విష్ణువుకు ఇది ప్రీతి పాత్రమైన అంశం. లక్ష్మీ నారసింహునికి సేవ చేయడానికి సాక్షాత్తూ ఆదిశేషుడే వాహనంగా విచ్చేశారని ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, పట్టు పీతాంబరాలతో విశేషాలంకరణలో ఉన్న ఖాద్రీశుడు రాత్రి తొమ్మిది గంటలకు శేషవాహనంపై కొలువుదీరారు. ఆలయం ముందు విద్యుద్దీపాలంకరణ పూర్తి కాగానే తిరువీధుల్లో ఊరేగారు. స్వామివారి దివ్య మంగళరూపాన్ని భక్తులు దర్శించుకుని తన్మయత్వం చెందారు. యాగశాల ప్రవేశం, నిత్య హోమం నిర్వహించి స్వామి వారిని సుగంధ ద్రవ్యాలతో అలంకరించారు. ఆచార్య రుత్వికులను ఆలయ మర్యాదలతో అర్చకులు ఆహ్వానించారు. శేష వాహనంపై ఉన్న స్వామి వారిని దర్శించుకుంటే నాగదోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. శేష వాహనోత్సవం ఉభయదారులుగా యాదాలం శ్రీనివాసులు, బాలాజీ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు, ఈఓ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. -
కదిరిలో ‘కంచె’ హీరోయిన్
బిగ్ సి షో రూం ప్రారంభం కదిరి : బిగ్ సి వారి 132వ నూతన షోరూంను సోమవారం అనంతపురం జిల్లా కదిరిలో సినీ నటి ప్రగ్య జైస్వాల్ (కంచె ఫేం) చేతుల మీదులగా ప్రారంభింపజేశారు. క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి ఐదు శాతం డబ్బు వాపసు ఇస్తారని ఆమె తెలిపారు. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక బహమతి అందుకోవచ్చన్నారు.సంస్థ డైరెక్టర్లు ఆర్.గౌతంరెడ్డి, వై.స్వప్నకుమార్ మాట్లాడుతూ అన్ని రకాల సెల్ఫోన్లు ఇక్కడ తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయన్నారు. బిగ్ 'సి' 14వ వార్షికోత్సం సందర్భంగా రూ.12,999 విలువ గల క్రోమ్యాక్స్ సెల్ కొంటే ఒక ఎల్ఈడీ టీవీ ఉచితమన్నారు. హెచ్‌టీసీ సెల్ కొనుగోలు చేస్తే రూ.6,990 విలువ గల 5.1 హోం థియేటర్, వైవో, ఒప్పో కంపెనీ ఫోన్లు కొనుగోలు చేస్తే రూ.1,999 విలువ గల పవర్ బ్యాంక్‌తో పాటు బ్లూటూత్ ఉచితం అన్నారు. స్యాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ సెల్ కొనుగోలు చేసిన వారికి రూ.2,000 వాపసు ఇస్తామన్నారు. కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో పట్టణవాసులు పాల్గొన్నారు. -
కర్షకున్ని కాటేసిన కరెంట్
గాండ్లపెంట: గాండ్లపెంట మండలం వద్దిరెడ్డిపల్లికి చెందిన ముక్తాపురం శ్రీనివాసులురెడ్డి(45) అనే రైతు శుక్రవారం విద్యుతాఘాతానికి గురై మరణించారని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. గాండ్లపెంట సమీపంలోని 15 ఎకరాల్లో సాగు చేసిన వంకాయ పంటకు నీటిని వదిలేందుకు వెళ్లిన ఆయన అక్కడ మోటరు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మరణించినట్లు వివరించారు. అక్కడే పొలంలో పని చేస్తున్న కూలీలు గమనించి వెంటనే శ్రీనివాసులరెడ్డి సోదరుడు అమరనాథరెడ్డికి సమాచారం అందించారు. అతనితో పాటు తల్లిదండ్రులతో పాటు మృతుని భార్య అనూరాధ ప్రమాదస్థలానికి వచ్చి శ్రీనివాసులరెడ్డి మృతదేహంపై పడి విలపించారు. నాన్న ఎక్కడని పిల్లలు అడిగితే ఏమని చెప్పాలని, ఇక తమకు దిక్కెవరంటూ అతని గుండెలపై పడి రోదించడం అందరి హృదయాలను బరువెక్కించింది. ప్రమాదస్థలికి చేరుకున్న అధికారులు సమాచారం అందిన వెంటనే ఎస్ఐ రాజశేఖర్, తహశీల్దార్ శ్రీనివాసులు, ట్రాన్స్‌కో ఏఈ గౌరీశంకర్ తమ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. మృతదేహఆన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
బంగారు గొలుసు అపహరణ
కదిరి టౌన్ : నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసును అగంతకులు లాక్కెళ్లారు. పట్టణంలోని అడపాల వీధిలో నివాసముంటున్న గంగులమ్మ ఆర్అండ్బీ బంగ్లాలో స్వీపర్‌గా పనిచేస్తోంది. సోమవారం విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను అటకాయించారు. మెడలోని గొలుసును లాక్కొంటుండగా గంగులమ్మ ప్రతిఘటించి కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చేలోపు ఆ యువకులు గొలుసు లాక్కొని ఆమెను కిందకు తోసేసి ఉడాయించారు. గాయపడిన బాధితురాలిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
హత్య కేసులో ఇద్దరి అరెస్టు
నంబులపూలకుంట: మండలంలోని అలుగుంటువారిపల్లికి చెందిన చలపతిని హత్య చేసిన కేసులో మణికుమార్, సిద్దయ్య అనే నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు కదిరి రూరల్ సీఐ రవికుమార్, నంబులపూలకుంట ఎస్ఐ రమేశ్‌బాబు తెలిపారు. గత ఏడాది మార్చి 13న గ్రామ సమీపంలో చలపతిని హతమార్చారు. అప్పట్లో అనుమానాస్పద స్థితి కేసుగా పోలీసులు నమోదు చేశారు. అయితే అతన్ని కొట్టి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టు రావడంతో ఆ తరువాత హత్య కేసుగా నమోదు చేశామన్నారు. విచారణలో పైన పేర్కొన్న ఇద్దరు నిందితులు తామే హతమార్చినట్లు విచారణలో అంగీకరించారన్నారు. -
వలస కూలీ ఆత్మహత్యాయత్నం
కదిరి అర్బన్ : కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లిలో మంగళవారం ఉదయం కాలెమ్మ(32) అనే వలస కూలీ విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్యం చేసింది. బతుకుదెరువు కోసం తమిళనాడు నుంచి పదేళ్ల కిందట వచ్చి ఇక్కడే స్థిరపడినట్లు కాలెమ్మ తల్లి సరోజ తెలిపింది. కొంతకాలంగా విపరీతమైన కడుపునొప్పితో తమ కుమార్తె బాధపడుతోందన్నారు. ఈ క్రమంలోనే మళ్లీ నొప్పి రావడంతో తట్టుకోలేక జీవితంపై విరక్తితో ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. వెంటనే ఆమెను కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలి ంచామన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. -
వలస కూలీ ఆత్మహత్యాయత్నం
కదిరి అర్బన్ : కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లిలో మంగళవారం ఉదయం కాలెమ్మ(32) అనే వలస కూలీ విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్యం చేసింది. బతుకుదెరువు కోసం తమిళనాడు నుంచి పదేళ్ల కిందట వచ్చి ఇక్కడే స్థిరపడినట్లు కాలెమ్మ తల్లి సరోజ తెలిపింది. కొంతకాలంగా విపరీతమైన కడుపునొప్పితో తమ కుమార్తె బాధపడుతోందన్నారు. ఈ క్రమంలోనే మళ్లీ నొప్పి రావడంతో తట్టుకోలేక జీవితంపై విరక్తితో ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. వెంటనే ఆమెను కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలి ంచామన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. -
‘చంపుతానని బెదిరిస్తున్నారు’
ఎన్పీకుంట : ముండ్లవారిపల్లి గ్రామానికి చెందిన టి.వెంకటరమణ తనను చంపుతానని బెదిరిస్తున్నాడని అంగన్వాడీ కార్యకర్త సిద్దుహుసేనమ్మ ఆరోపించారు. సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. బంగారు తల్లి పథకం కోసం టి.వెంకటరమణ ఇదివరకు దరఖాస్తు ఇవ్వగా, దానిని తాను ఐసీడీఎస్ సూపర్వైజర్కు అందజేశానని చెప్పారు. అయితే బంగారుతల్లి పథకం మంజూరు కాకపోవడంతో, అందుకు తనే కారణమని ఆదివారం ఇంటికి వచ్చి మద్యం మత్తులో తీవ్రపరుష పదజాలంతో దూషించాడని తెలిపారు. అదే సమయంలో తన భర్త రావడంతో ‘నీ అంతు చూస్తానంటూ’ బెదిరించి వెళ్లిపోయాడన్నారు. ఇతని నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో కోరానన్నారు. -
వైఎస్ జగన్‌కు ఆత్మీయ స్వాగతం
కదిరి : బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సాయంత్రం అనంతపురం జిల్లా పొలిమేరల్లో అడుగుపెట్టగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికారు. కొడికొండ చెక్‌పోస్టు వద్ద వైఎస్సార్సీపీ చిలమత్తూరు మండల కన్వీనర్ సదాశివరెడ్డి ఆయనను కలిసి జిల్లా కరువు పరిస్థితులను వివరించారు. ఈసారి ఖరీఫ్‌లో సాగుచేసిన వేరుశనగ పూర్తిగా ఎండిపోయిందని, కనీసం పెట్టుబడులు కూడా చేతికందలేదని చెప్పారు. ప్రభుత్వం గత ఏడాది ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదని ఆయన దృష్టికి తెచ్చారు. ఆ వివరాలన్నీ పక్కాగా పంపాలని చెప్పిన జగన్ అక్కడ సెలవు తీసుకుని గోరంట్ల చేరుకున్నారు. అక్కడ వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయనతో కరచాలం చేయడానికి అమితాసక్తి చూపించారు. వారందరికీ అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగిపోయారు. ఓడి చెరువు చేరుకోగానే ముందుగానే అక్కడికి చేరుకున్న జనం ‘జై జగన్.. జై జై జగన్’ అంటూ గట్టిగా అరిచారు. వారిని ఆప్యాయంగా చూస్తూ అభివాదం చేశారు. తర్వాత కదిరి పట్టణంలోని వేమారెడ్డి కూడలికి చేరుకోగానే జనమంతా ఒక్కసారిగా ‘కాబోయే సీఎం వైఎస్ జగన్ జిందాబాద్’ అంటూ నినదిస్తూ ఈలలు, కేకలు వేశారు. అభిమానులతో కరచాలనం చేసిన జగన్ జనం ఎక్కువగా ఉండటంతో వాహనమెక్కి అందరికీ రెండు చేతులు జోడించి నమస్కరించారు. అభివాదం చేస్తూ నవ్వుతూ వారి వద్ద సెలవు తీసుకుని బయల్దేరారు. వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్ధారెడ్డిని తన వాహనంలో పులివెందుల వరకు తీసుకెళ్లారు. హర్తాళ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసుల చేత భగ్నం చేయించారని సిద్ధారెడ్డి జగన్‌కు తెలిపారు. 10 రోజులుగా ప్రజలు తమ ఖాతాల్లో ఉన్న డబ్బులు డ్రా చేసుకోవడానిక్కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏ బ్యాంకుకెళ్లినా డబ్బు లేదనే సమాధానమే ఎదురవుతోందన్నారు. ఈ సందర్భంగా హంద్రీ-నీవాపై ఆరా తీసిన జగన్ ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండాలని సిద్ధారెడ్డికి సూచించారు. -
ఆర్మీలో ఎంపిక కాలేదని యువకుడి బలవన్మరణం
కదిరి టౌన్ : ఆర్మీ రిక్రూట్మెంట్లో తాను ఎంపిక కాలేదన్న కారణంగా తీవ్ర మనస్థాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమీప బంధువులు అందించిన వివరాల మేరకు.. అమడగూరు మండలం కొత్తపల్లికి చెందిన బాలాజీ(26)అనే యువకుడు అనంతపురంలో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్లో పాల్గొనేందుకు ధ్రువీకరణ పత్రాలు తీసుకొని శుక్రవారం అనంతపురానికి బయలుదేరివెళ్లాడు. అక్కడ అన్ని దేహదారుఢ్య పరీక్షలు, పరుగు పందెం తదితర పరీక్షల్లో నెగ్గిన బాలాజీ చివరకు రాత పరీక్షలో విజయం సాధించలేకపోయాడు. దీంతో కలత చెంది సోమవారం తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. మధ్యాహ్నం కదిరిలో రైలు దిగిన బాలాజీ స్టేషన్ వెనుకభాగంలో (రాజీవ్‌గాంధీనగర్) తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. అక్కడ జన సంచారం లేకపోవడంతో అతడ్ని ఎవరూ గుర్తించలేక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు ఉన్నాడు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ గోపాలుడు సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని బాలాజీ చొక్కాజేబులోని ఫోన్ నంబర్ల సాయంతో బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. -
కదిరి కళాశాలలో కలకలం
ఇంటర్ విద్యార్థిపై బ్లేడ్‌తో దాడి బైక్‌పై పరారైన దుండగులు కదిరిలోని బసిరెడ్డి జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిపై దుండగులు బ్లేడ్‌తో దాడిచేసి గాయపరచడం కలకలం రేగింది. వివరాల్లోకెళితే.. మూర్తిపల్లికి చెందిన నరసింహనాయక్ సీఈసీ ఫస్టియర్ చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం కళాశాల వెలుపల మూత్ర విసర్జనకు వెళ్లాడ. ముఖానికి మాస్కు ధరించిన ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి వెంకటేష్ ఎక్కడ..? అని అడిగారు. నా సోదరుడే ఏంటి.. అని నరసింహనాయక్ అనడంతో ఆ వ్యక్తులు బ్లేడుతో అతని కుడి చేతికి, అరచేతికి, కుడికాలికి విచక్షణారహితంగా కోసి బైక్‌పై వెళ్లిపోయారు. రక్త గాయాలతో విద్యార్థి గట్టిగా కేకలు వేయగా తోటి విద్యార్థులు పరుగున వచ్చారు. ప్రిన్సిపల్ సునీల్‌కుమార్‌రెడ్డి, తోటి విద్యార్థులు వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు రాజేంద్ర ఆస్పత్రికి చేరుకుని విద్యార్థిని పరామర్శించారు. కళాశాల ఆవరణలోనే ఇలాంటి దురాగతాలు జరగడం దురదృష్టకర మన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల మధ్య తలెత్తిన విభేదాలతో దాడి జరిగిందా.. లేక ఇంకేదైనా కారణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
అర్ధరాత్రితమ్ముళ్ల మధ్య రగడ
పింఛన్లు పంపిణీ చేసిన మున్సిపల్, పోస్టల్ సిబ్బంది వృద్ధుల నుంచి రూ.200 వసూలు చేసి టీడీపీ 13వ వార్డు కౌన్సిలర్ కొడుకు దీనిపై మున్సిపల్ చెర్‌పర్సన్ భర్త ఆగ్రహం ఇరువురి మధ్య తోపులాట కదిరి : కదిరి పట్టణంలోని నిజాంవలీ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి ప్రజలందరూ చూస్తుండగానే తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. స్థానికుల కథనం ప్రకారం... మంగళవారం రాత్రి నిజాంవలీ కాలనీలోని 13, 14, 15వ వార్డుల్లో పోస్టాఫీసు, మున్సిపల్ శాఖ అధికారులు పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ మూడు వార్డులకు టీడీపీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 13వ వార్డు నుంచి ఎన్నికైన కౌన్సిలర్ తుమ్మల అమీనాబీ కుమారుడు అయూబ్ వృద్ధులకు ఇవ్వాల్సిన రూ.1000 పెన్షన్ మొత్తంలో రూ.200 నొక్కేస్తున్నాడని స్థానికులు అదే పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ సురయాభాను భర్త బాబ్జాన్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. అప్పటికే అర్ధరాత్రి 2 గంటలవుతోంది. చైర్పర్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న 15వ వార్డులో కూడా కొంతమందికి అప్పటికే పెన్షన్లు అందించారు. ఆ వార్డుకు చెందిన వృద్ధులకు సైతం రూ.200 పట్టుకొని రూ.800లే పంపిణీ చేశారు. ముసలీ, ముతకా చేసేది లేక రూ.800 తీసుకొని వెనుదిరిగారు. ఈ విషయం వారు తమ ఇళ్లలో చెబితే వారి కుటుంబీకులు అప్పటికే పెన్షన్ల పంపిణీ చేస్తున్న చోటుకు చేరుకున్నారు. అదే సమయంలో చైర్పర్సన్ భర్త బాబ్జాన్ అక్కడికి చేరుకోవడంతో అక్కడి ప్రజలు అతనికి ఫిర్యాదు చేశారు. ముసలోళ్లకు ఇచ్చే రూ.1000 నుంచి రూ.200 కమిషన్ ఎందుకు తీసుకుంటున్నారని ఆయన అక్కడున్న అధికారులను ప్రశ్నించారు. ఇందుకు వారు అక్కడే ఉన్న టీడీపీ నేత అయూబ్ వైపు చూడటంతో ‘ఈ కమీషన్ల బాగోతం మీదేనా’ అనగానే ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకొన్నారు. తన భార్య ప్రాతినిధ్యం వ హించే 15వ వార్డులో పెన్షన్ పంపిణీ చేయడానికి మీరెవరని ఆయన అయూబ్‌పై మండిపడ్డారు. నిజాంవలీ కాలనీలోని 3 వార్డులు తననే చూసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చెప్పారనగానే బాబ్జాన్కు మరింత కోపమొచ్చింది. ఆయన వెంటనే కందికుంటకు ఫోన్‌చేసి విషయం చెప్పారు. ప్రజల ముందు గొడవ పడితే పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న భావనతో ఆయన ఇరువురికి ఫోన్ ద్వారానే సర్దిచెప్పి సమస్య సద్దుమనిగేలా చేశారు. తన భార్య చైర్పర్సన్ అనే విషయం మీకు తెలిసి కూడా ఆమెకు తెలీకుండా అయూబ్ ఆధ్వర్యంలో పింఛన్లను పంపిణీ చేయడమేంటని అక్కడున్న మున్సిపల్ సిబ్బందిని బాబ్జాన్ మందలించారు. అర్ధరాత్రి పూట వణికించే చలిలో ముసలోళ్లకు ఏదైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారనడంతో పోస్టల్, మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారని సమాచారం. అర్ధరాత్రి సమయంలో పెన్షన్లు పంపిణీ చేయడంపై మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్‌ను ‘సాక్షి’వివరణ కోరింది. పంపిణీ రోజంతా చేసినా సమయం సరిపోలేదని తెలిపారు. రూ.1000 బదులు రూ.800 ఇస్తున్నారన్న ఆరోపణలపై అలాంటిదేమీ లేదని, అయినా సరే విచారిస్తామని చెప్పారు.