ఆర్మీలో ఎంపిక కాలేదని యువకుడి బలవన్మరణం
కదిరి టౌన్ : ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో తాను ఎంపిక కాలేదన్న కారణంగా తీవ్ర మనస్థాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమీప బంధువులు అందించిన వివరాల మేరకు.. అమడగూరు మండలం కొత్తపల్లికి చెందిన బాలాజీ(26)అనే యువకుడు అనంతపురంలో జరిగే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనేందుకు ధ్రువీకరణ పత్రాలు తీసుకొని శుక్రవారం అనంతపురానికి బయలుదేరివెళ్లాడు. అక్కడ అన్ని దేహదారుఢ్య పరీక్షలు, పరుగు పందెం తదితర పరీక్షల్లో నెగ్గిన బాలాజీ చివరకు రాత పరీక్షలో విజయం సాధించలేకపోయాడు. దీంతో కలత చెంది సోమవారం తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. మధ్యాహ్నం కదిరిలో రైలు దిగిన బాలాజీ స్టేషన్ వెనుకభాగంలో (రాజీవ్‌గాంధీనగర్) తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. అక్కడ జన సంచారం లేకపోవడంతో అతడ్ని ఎవరూ గుర్తించలేక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు ఉన్నాడు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ గోపాలుడు సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని బాలాజీ చొక్కాజేబులోని ఫోన్ నంబర్ల సాయంతో బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.