కనుల పండువగా శ్రీవారి చక్రస్నానం
- పోటెత్తిన భక్త జనం
- ధ్వజావరోహణం తర్వాత నృసింహాలయం మూసివేత
- నేటి నుంచి యథావిధి దర్శనం
శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీవారి చక్రస్నానం (తీర్థవాది ఉత్సవం) కనుల పండువగా, కోలాహలంగా జరిగింది. యాగశాల నుంచి శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామి వారు విచ్చేసి ఆలయ ప్రాంగణంలో కాసేపు కొలువు దీరారు. అక్కడ వసంతోత్సవం నిర్వహించారు.
ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు దంపతులు, ఈఓ వెంకటేశ్వరరెడ్డి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులతో పాటు ఆలయ సిబ్బంది, బందోబస్తులో ఉన్న పోలీసులతో పాటు భక్తులంతా ఆనందోత్సాహాలతో వసంతాలు(రంగులు) చల్లుకున్నారు. అనంతరం శ్రీవారు శ్రీదేవి, భూదేవితో కలిసి తిరువీధుల గుండా దర్శనమిస్తూ భృగుతీర్థం చేరుకున్నారు. అక్కడ భక్తుల గోవింద నామస్మరణ మధ్య శ్రీవారు చక్రస్నానం ఆచరించారు. అనంతరం భక్తులందరూ కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. అక్కడి నుంచి ఖాద్రీ«శుడు కోనేరు వెలుపలకొచ్చి అక్కడ విశేషాలంకరణ అనంతరం తిరువీధుల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్గిస్తూ తిరిగి ఆలయ ప్రాంగణం చేరుకున్నారు.
ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాలకు సకల దేవతా మూర్తులను ఆహ్వానించేందుకు అర్చకులు ఆలయం ముందు ప్రారంభం నాడు ధ్వజారోహణం చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు కొత్త వస్త్రాన్ని తెచ్చి శ్రీవారి వాహనమైన గరుడి బొమ్మను చిత్రీకరించారు. దాన్ని గరుడ ధ్వజ పటం అంటారు. కొడితాడు సాయంతో దాన్ని ధ్వజస్తంభం మీద కట్టి పైకి ఎగుర వేశారు.
పక్షం రోజుల పాటు గాలిలో ఎగిరిన ఈ గరుడ పతాకమే సకల దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రం. ఈ ఆహ్వానాన్ని అందుకొనే ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసి కదిరి కొండపై నుంచి తిలకిస్తారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. «ధ్వజపటాన్ని శ్రీవారి చక్రస్నానం అనంతరం «అవరోహణం గావించారు. దీంతో ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలికినట్లైందని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు.
ఆలయం మూసివేత
కల్యాణోత్సవం నాటి నుంచి తీర్థవాది వరకూ స్వామి వారు యాగశాలలోనే గడిపారు. తీర్థవాది ముగించుకొని తిరిగి ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం నుంచి రోజంతా ఆలయం తలుపులు మూసేశారు. తిరిగి మంగళవారం ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు. ఎప్పటిలాగానే శ్రీవారు ఆలయంలో యథాప్రకారం పూజలందుకొని భక్తులకు దర్శనమిస్తారు.